Let's talk: editor@tmv.in
రూ.3,034 కోట్ల రిలయన్స్‌ ఆస్తులు ఈడీ అటాచ్

రూ.3,034 కోట్ల రిలయన్స్‌ ఆస్తులు ఈడీ అటాచ్

Pinjari Chand
29 ఏప్రిల్, 2026

రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన బ్యాంకు మోసం కేసులో రూ.3,034.90 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం వెల్లడించింది. దీంతో రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ (ఆర్‌‌ఏఏజీ) కేసుల్లో మొత్తం అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.19,344 కోట్లకు పైగా చేరింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌‌కామ్‌) కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) బ్యాంకు/ప్రజా నిధుల మళ్లింపు, మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ నిర్వహిస్తోంది.

బ్యాంకుల ప్రయోజనాలు, ప్రజా ధనం రక్షణ దృష్ట్యా ఆస్తులు ఎక్కడికీ మళ్లించకుండా నిరోధించేందుకు పీఎంఎల్‌ఏ చట్టం కింద తాత్కాలికంగా ఈ అటాచ్‌మెంట్ చర్యలు తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఈ దర్యాప్తు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసిన పలు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ప్రారంభమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల ఫిర్యాదులపై ఈ కేసులు నమోదయ్యాయి.

ఆర్‌‌కామ్‌, దాని అనుబంధ సంస్థలు దేశీయ, విదేశీ రుణదాతల నుంచి తీసుకున్న రుణాల్లో సుమారు రూ.40,185 కోట్లు బాకీగా ఉన్నట్లు ఈడీ తెలిపింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో ముంబైలోని ఉషా కిరణ్ భవనంలో ఫ్లాట్, పుణే ఖండాలాలో ఫార్మ్‌హౌస్, అహ్మదాబాద్ సమీపంలోని సనంద్‌లో భూమి, అలాగే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌కు చెందిన 7.71 కోట్ల షేర్లు ఉన్నాయి. ఇవి అనిల్ అంబానీ కుటుంబానికి చెందిన ప్రైవేట్ ఫ్యామిలీ ట్రస్ట్ అయిన రైజ్‌ ఈ ట్రస్ట్ కింద ఉన్న సంస్థ ద్వారా నిర్వహిస్తున్నామని ఈడీ తెలిపింది. పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం, చివరికి చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక ఈ ఆస్తులను నష్టపోయిన బ్యాంకులు వంటి బాధితులకు తిరిగి ఇవ్వవచ్చని ఈడీ పేర్కొంది. ప్రజా ధనం రక్షణ కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ కేసులో మరిన్ని దర్యాప్తులు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.

రూ.3,034 కోట్ల రిలయన్స్‌ ఆస్తులు ఈడీ అటాచ్ - Tholi Paluku