
ఏపీలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎబోలా స్క్రీనింగ్ పరీక్షలు
ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి వైరస్ ప్రవేశించకుండా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాలలో పటిష్టమైన స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సింగపూర్ నుంచి వచ్చిన 183 మంది ప్రయాణికులకు ప్రత్యేక వైద్య బృందాలు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ తనిఖీలు చేపడుతున్నామని, ఇప్పటివరకు ఎవరిలోనూ ఎబోలా లక్షణాలు కనిపించలేదని వైద్యులు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరికైనా లక్షణాలు తలెత్తితే వారిని ఉంచేందుకు ప్రత్యేక క్వారంటైన్ గదులను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
ఈ నివారణ చర్యలపై డాక్టర్ టి. జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్య రక్షణ కోసం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. గన్నవరం విమానాశ్రయానికి ప్రతి మంగళవారం, గురువారం, శనివారాల్లో అంతర్జాతీయ విమానాలు వస్తుంటాయని, ఆ రోజుల్లో వచ్చే ప్రయాణికులందరికీ స్క్రీనింగ్ తప్పనిసరి చేశామని ఆయన తెలిపారు. గురువారం వచ్చిన ప్రయాణికులలో ఎవరికీ ఆఫ్రికా దేశాల ప్రయాణ చరిత్ర లేదని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే ఐసోలేట్ చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. ఈ స్క్రీనింగ్ ప్రక్రియ మంగళవారం నుండే నిరంతరాయంగా కొనసాగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
భారతదేశంలో ఎబోలా కేసులు లేవు
ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో ఎబోలా తీవ్రత దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మే 17న అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
ఇటీవల ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన ఒక వ్యక్తికి స్వల్ప ఒంటి నొప్పులు ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. అతని శాంపిల్స్‌ను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా.. బుధవారం నాటికి పరీక్షల ఫలితాలు నెగెటివ్ అని వచ్చాయి. ప్రస్తుతానికి భారతదేశంలో ఎక్కడా ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం పటిష్ట నిఘాను కొనసాగిస్తున్నాయి.
