
విజయవాడ ఎయిర్‌పోర్టులో ఎబోలా స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభం
ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతున్న ప్రమాదకర ఎబోలా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం నుంచే ప్రత్యేక హెల్త్ స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా రాష్ట్రంలోకి వైరస్ ప్రవేశించకుండా ఆరోగ్య శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు విమానాశ్రయంలో ఒక ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఒక వైద్యుడితో పాటు పారామెడికల్ సిబ్బందిని నియమించి, విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయానికి సింగపూర్ నుంచి వారానికి మూడు రోజులు మాత్రమే అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో ఈ విమానాలు విజయవాడకు రాకపోకలు సాగిస్తుండటంతో ఆయా రోజుల్లో వచ్చే ప్రయాణికులపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భద్రతా దృష్ట్యా షార్జా నుంచి విజయవాడకు నడిచే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ఎబోలా అనేది అత్యంత ప్రమాదకరమైన ప్రాణాంతక వైరల్ వ్యాధి. ఇది మనుషులతో పాటు ఇతర ప్రైమేట్స్‌ను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అడవి జంతువులైన ఫ్రూట్ బ్యాట్స్, పందికొక్కులు, కోతులు వంటి వాటి ద్వారా మనుషులకు సోకే ఈ వైరస్ ఆ తర్వాత సంక్రమిత వ్యక్తుల రక్తం, శరీర ద్రవాలు, అవయవాలు లేదా వారు వాడిన కలుషితమైన వస్తువుల ద్వారా ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎబోలా వంటి అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రీతిలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ అంతర్జాతీయ ప్రయాణికులకు పటిష్టమైన తనిఖీలు నిర్వహిస్తోంది.
