Let's talk: editor@tmv.in
ఎబోలా కలకలం.. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు అనుమానితులు

ఎబోలా కలకలం.. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు అనుమానితులు

Gaddamidi Naveen
6 జూన్, 2026

హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి. జ్వర లక్షణాలతో మరో సూడాన్ దేశానికి చెందిన యువకుడిని గాంధీ ఆసుపత్రిలో చేర్చడంతో ఎబోలా అనుమానితుల సంఖ్య రెండుకు చేరింది. ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, 20 ఏళ్ల వయస్సు గల సూడాన్ విద్యార్థి ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి గురువారం సాయంత్రం గాంధీ ఆసుపత్రికి తరలించబడ్డాడు. జ్వరంతో బాధపడుతున్న అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడిందని, శుక్రవారం ఉదయం నాటికి జ్వరం తగ్గిందని అధికారులు వెల్లడించారు. అతనితో పాటు వచ్చిన వ్యక్తికి ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.

ఇదిలా ఉండగా, గురువారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మరో 35 ఏళ్ల సూడాన్ పౌరుడిని కూడా గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మోకాలి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఈ వ్యక్తికి విమానాశ్రయంలో నిర్వహించిన థర్మల్ స్క్రీనింగ్‌లో జ్వరం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అతనికి కూడా ఎలాంటి లక్షణాలు లేవని, జ్వరం పూర్తిగా తగ్గిందని వైద్యులు తెలిపారు. ఈ ఇద్దరి రక్త నమూనాలను పరీక్షల కోసం పంపించగా, నివేదికలు రావాల్సి ఉంది. ఫలితాలు వచ్చే వరకు వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతున్నారు. ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా 10 పడకలతో కూడిన ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అప్రమత్తత

కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ గత నెలలోనే ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. ఉగాండా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ) వాటి పరిసర హై-రిస్క్ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు విమానం దిగడానికి ముందే ‘సెల్ఫ్-డిక్లరేషన్ ఫారమ్’ (ఎస్డీఎఫ్) పూర్తి చేయడం తప్పనిసరి అని పేర్కొంది.

ఎబోలా వైరస్ అంటే ఏమిటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఎబోలా అనేది మనుషులకు, జంతువులకు సోకే అత్యంత తీవ్రమైన, ప్రాణాంతకమైన వ్యాధి. అడవి జంతువులైన ఫ్రూట్ బ్యాట్స్ (గబ్బిలాలు), ముళ్లపందుల ద్వారా ఇది మొదట మనుషులకు వ్యాపిస్తుంది. ఆ తర్వాత సోకిన వ్యక్తుల రక్తం, స్రావాలు, అవయవాలు లేదా ఇతర శారీరక ద్రవాలతో ప్రత్యక్ష పరిచయం ఏర్పడటం ద్వారా, వారు వాడిన దుస్తులు, బెడ్‌షీట్లను తాకడం ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది.