

హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా కలకలం..
హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ అనుమానిత కేసు వెలుగులోకి రావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గురువారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ సూడాన్ దేశ పౌరుడికి ఎబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తమవడంతో అతడిని ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రానికి తరలించి వైద్య పర్యవేక్షణలో ఉంచారు.
అధికారుల వివరాల ప్రకారం, ఆ ప్రయాణికుడు ఇటీవల దక్షిణ సూడాన్, ఉగాండా దేశాలకు వెళ్లివచ్చాడు. ప్రస్తుతం కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులందరికీ ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆ వ్యక్తిలో అనుమానాస్పద లక్షణాలు గుర్తించడంతో వెంటనే వైద్య బృందాలు అప్రమత్తమయ్యాయి.
అయితే ఇది ఇప్పటివరకు నిర్ధారిత ఎబోలా కేసు కాదని అధికారులు స్పష్టం చేశారు. ప్రభావిత దేశాలకు ప్రయాణించిన చరిత్ర ఉండటం, కొన్ని లక్షణాలు కనిపించడం వల్ల మాత్రమే అతడిని అనుమానిత కేసుగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. రక్త నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపినట్లు, పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే అతడికి నిజంగా ఎబోలా వైరస్ సోకిందా లేదా అనే విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే ప్రత్యేక ఎబోలా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనుమానిత రోగిని అక్కడ ఉంచి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
ఇటీవలే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యాజమాన్యం ప్రత్యేక ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. పౌర విమానయాన మహానిర్దేశక సంస్థ (డీజీసీఏ ), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులపై కఠిన నిఘా కొనసాగుతోంది.
ఉగాండా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇతర అధిక ప్రమాద ప్రాంతాల నుంచి వచ్చే లేదా అక్కడి మీదుగా ప్రయాణించే వారు విమానం దిగే ముందు స్వీయ ప్రకటన పత్రం సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే వారికి ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఎబోలా అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది సోకిన అడవి జంతువుల నుంచి మనుషులకు వ్యాపించడంతో పాటు, అనంతరం బాధితుల రక్తం, శరీర ద్రవాలు లేదా కలుషితమైన వస్తువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. సరైన చికిత్స లేకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో నమోదైన ఈ అనుమానిత కేసుతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమై పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పరీక్షల ఫలితాలు వచ్చే వరకు సంబంధిత వ్యక్తిని పూర్తి ఐసోలేషన్‌లో ఉంచి అన్ని వైద్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
