Let's talk: editor@tmv.in
తలసేమియాకు చెక్ చెప్పాలంటే ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి:మంత్రి దామోదర్ రాజనర్సింహ

తలసేమియాకు చెక్ చెప్పాలంటే ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి:మంత్రి దామోదర్ రాజనర్సింహ

Panthagani Anusha
9 మే, 2026

ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ వ్యాధిపై సమాజంలో అవగాహన కల్పించేందుకు తలసేమియా, సికిల్‌సెల్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ అవేర్‌నెస్ వాక్ నిర్వహించారు. ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వాక్‌లో తలసేమియా రోగులు, వారి కుటుంబ సభ్యులు, వైద్యులు, యువత,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తలసేమియా అనేది అంటువ్యాధి కాదని ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధి అని స్పష్టం చేశారు. ముఖ్యంగా సమీప బంధువుల మధ్య జరిగే మేనరికం వివాహాల వల్ల ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. దీనిని అరికట్టేందుకు యువత వివాహానికి ముందే తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని తద్వారా రాబోయే తరాలను ఈ వ్యాధి నుంచి రక్షించవచ్చని సూచించారు. కొత్తగా వివాహమైన దంపతులకు కూడా ఈ జన్యుపరమైన వ్యాధులపై అవగాహన ఉండాలని ఆయన కోరారు.

ఇక తలసేమియా రోగులకు ఎదురయ్యే ఇబ్బందులను ప్రస్తావిస్తూ వారికి క్రమం తప్పకుండా రక్త మార్పిడి, ఐరన్ చెలేషన్ థెరపీ అవసరమైన చోట బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి ఖరీదైన వైద్యం అవసరమని మంత్రి తెలిపారు. ఈ ఖర్చును పేద కుటుంబాలు భరించలేవని గుర్తించిన ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత చికిత్స, మందులను అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వాటిని మరింత బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా తలసేమియా సేవలను విస్తరించే క్రమంలో భాగంగా ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోంది. గిరిజన ప్రాంతాల్లో వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్నందున వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో హిమోగ్లోబినోపథీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అదేవిదంగా ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్న డే కేర్ సెంటర్లను త్వరలో ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 11 లక్షల మందికి సికిల్‌సెల్ వ్యాధి స్క్రీనింగ్ నిర్వహించినట్లు ఆయన వివరించారు.

అవగాహన ముందస్తు స్క్రీనింగ్ నాణ్యమైన చికిత్స ద్వారా తెలంగాణను దేశంలోనే తొలి తలసేమియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తలసేమియా–సికిల్‌సెల్ సొసైటీ ప్రతినిధులు, రక్తదాతలు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.