
నగరంలో గంజాయి నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
నగరంలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి తాగుతూ అల్లరి సృష్టిస్తున్నారనే పలు ఫిర్యాదులపై తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మత్తుపదార్థాల నిరోధక ప్రత్యేక విభాగం ‘ఈగల్’ ఫోర్స్ శనివారం మెరుపు దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు గంజాయి సరఫరాదారులతో పాటు 13 మంది వినియోగదారులను అధికారులు పట్టుకున్నారు.
మత్తుపదార్థాల నియంత్రణ కోసం ఏర్పాటైన ‘ఈగల్’ ఫోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. అసెంబ్లీ భవన సముదాయానికి సమీపంలో ఉన్న పబ్లిక్ గార్డెన్స్‌లో కొంతమంది యువకులు గుంపులుగా చేరి గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం అందింది. దీనిపై స్పందించిన అధికారులు అక్కడ దాడి చేసి ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో టీహెచ్‌సీ పాజిటివ్‌గా తేలింది. దీనిపై హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, సదరు యువకులను వ్యసనం నుంచి విముక్తి కల్పించేందుకు ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక ఆరోగ్య సంస్థ (ఐఎంహెచ్) డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు.
మరొక ఆపరేషన్‌లో భాగంగా, జగద్గిరిగుట్ట, దాని పరిసర ప్రాంతాలలో అక్రమంగా సాగుతున్న గంజాయి నెట్‌వర్క్‌ను స్థానిక పోలీసుల సమన్వయంతో ఈగల్ ఫోర్స్ ఛేదించింది. గంజాయి సేవించి ఒక వ్యక్తి హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాడనే ఫిర్యాదుతో ఈ దాడి జరిగింది. ఈ క్రమంలో జగద్గిరిగుట్టలో పాన్ షాపులు నడుపుతున్న ఇద్దరు నిందితులతో పాటు ఎనిమిది మంది గంజాయి వినియోగదారులను అధికారులు పట్టుకున్నారు. వీరందరికీ టీహెచ్‌సీ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఇద్దరు సరఫరాదారులు, ఎనిమిది మంది వినియోగదారులను జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు అప్పగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
