
E20 పెట్రోల్ సేఫేనా?
ఇప్పుడంతా ఎథనాల్ మిశ్రిత పెట్రోల్ గురించే మాట్లాడుకుంటున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సైతం ఎథనాల్ మిశ్రిత పెట్రోల్ చాలా సేఫ్ అంటున్నారు. ఎథనాల్ మిశ్రిత పెట్రోల్ అంటే సాధారణ పెట్రోల్‌లో పంటల నుంచి వచ్చే ద్రవ ఇంధనం అయిన ఎథనాల్‌ని కలిపి వినియోగించడం. పంచదార, మక్కజొన్న, బియ్యం లాంటి పంటలతో ఎథనాల్ తయారవుతుంది. E20 అంటే అందులో 20శాతం ఎథనాల్, 80శాతం పెట్రోల్ ఉంటుందని అర్థం. ఇలా కలపడం వల్ల దేశం బయట నుంచి కొనాల్సిన ముడి చమురు కొంతవరకు తగ్గుతుంది, వాహనాల పొగ కూడా కొద్దిగా తగ్గుతుంది. రైతులకు కొత్త ఆదాయం వస్తుంది. ఇదే కారణంగా భారత్ సహా అనేక దేశాలు ఎథనాల్ మిశ్రమాల్ని పెంచుతున్నాయి.
బ్రెజిల్ చాలా సంవత్సరాలుగా ఎక్కువ శాతం ఎథనాల్ కలిసిన పెట్రోల్ వాడుతోంది, అక్కడ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్లు నేరుగా ఎథనాల్ ఎక్కువగా కలిసిన ఇంధనాన్ని వాడగలవు. అమెరికాలో సాధారణంగా E10 అంటే పది శాతం మిశ్రమం ఎక్కువ భాగం పెట్రోల్ బంకులలో దొరుకుతుంది, కొన్ని ప్రాంతాల్లో E15 కూడా ఉంది, ప్రత్యేక ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలు అయితే E85 కూడా తీసుకుంటాయి. యూరోప్‌లో జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు E10ని సాధారణంగా పెట్రోల్‌గా అమ్ముతున్నాయి. థాయ్‌లాండ్ వంటి ఆసియా దేశాలు గ్యాసోహాల్ పేరుతో E20ని విస్తృతంగా వాడుతున్నాయి. అంటే ప్రపంచం నలుదిశలలోనూ ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ కొత్త విషయం కాదు.
మరోవైపు ఈ E20పై చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది ఎథనాల్‌లో శక్తి సాంద్రత పెట్రోల్ కంటే కొద్దిగా తక్కువ కాబట్టి కొత్త కార్లలో 1-2 శాతం, పాత కార్లలో 3-6 శాతం వరకు మైలేజ్ తగ్గవచ్చు. కానీ ఇంజిన్ ట్యూనింగ్ సరిగ్గా ఉంటే ఈ తేడా తగ్గుతుంది. రెండోది పదార్థాలపై ప్రభావం. చాలా పాత వాహనాల్లో రబ్బరు సీల్స్, గ్యాస్కెట్లు వేగంగా మాడిపోతాయేమో అన్న భయం ఉంటుంది. అందుకే కొత్త ప్రమాణాల్లో తుప్పు నిరోధక పదార్థాలు ఇంధనంలో ఉంటాయి. కంపెనీలు కూడా ఎథనాల్‌కు సరిపోయే భాగాలు వాడుతున్నాయి. మూడోది చల్లని వాతావరణంలో స్టార్టింగ్ సమస్యలు అన్న మాట. ప్రస్తుతం ఉండే మిశ్రమాల్లో ఈ పరీక్షలు కూడా చేసి సమస్యలు లేనట్టు సంస్థలు చెబుతున్నాయి. ఇక కంపెనీల నుంచి వచ్చే ఫిర్యాదులు ఏమిటి అంటే పాత స్టాక్ వాహనాల కంపాటిబిలిటీ, వారంటీ ఖర్చులు పెరగవచ్చన్న ఆందోళన, పంపుల దగ్గర నిల్వలు నిర్వహించడం, నీరు కలిస్తే ఫ్యుయెల్ విడిపోవడం వంటి ఆపరేషన్ సమస్యలు. వీటికి పరిష్కారంగా ఆయిల్ కంపెనీలు నిల్వ ట్యాంకుల మెయింటెనెన్స్, నీరు ప్రవేశించకుండా చూసే ప్రమాణాలు, అడిటివ్‌లు వంటివి అమలు చేస్తున్నాయి. వాహన తయారీదారులు కూడా 2023 నుంచి మెటీరియల్ కంప్లైయింట్, 2025 నుంచి ఫుల్ E20 కంప్లైయింట్ మోడళ్లను విడుదల చేస్తున్నారు.
ఇక E20 వల్ల కార్లు చెడిపోతున్నాయా అన్న ప్రశ్నను కేంద్రం ఖండించింది. పెద్ద పరిమాణంలో చేసిన టెస్టులు చూపించింది. పవర్ పికప్ మైలేజ్‌లో గణనీయమైన తేడా లేదని తెలిపింది. మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఎవరైనా ఒక కారైనా సమస్యలో పడిందని చూపించమని సవాల్ విసిరారు. మొత్తంగా చూస్తే ఇది సాధారణ పెట్రోల్ కాదు.. దేశానికి ఆదా చేసే మార్గం.
