
ఏపీలో ఈ-బస్సుల విప్లవం.. 11 నగరాల్లో 750 బస్సులు
ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణహిత విద్యుత్ ఆధారిత (ఈ-మొబిలిటీ) ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక “పీఎం ఈ-బస్ సేవ” పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు.
గ్రీన్ మొబిలిటీ, కాలుష్య నియంత్రణ, స్వచ్ఛ ఇంధన వినియోగం, ఆధునిక రవాణా సేవల విస్తరణే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ-బస్సుల ఛార్జింగ్ స్టేషన్లకు సంబంధించిన విద్యుత్ మౌలిక సదుపాయాల పనుల పురోగతిపై ఏపీఎస్‌ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ ఎం.టి. కృష్ణబాబుతో కలిసి విజయానంద్ వర్చువల్ సమీక్ష నిర్వహించి పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కాగా ఈ పథకం కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టిన టెండర్-II ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 750 ఈ-బస్సులు మంజూరయ్యాయి. ఇవి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, కడప, తిరుపతి, రాజమహేంద్రవరం, అమరావతి, అనంతపురం లాంటి 11 ప్రధాన నగరాల్లోని 12 డిపోల పరిధిలో సేవలందించనున్నాయి. ఈ మంజూరైన బస్సుల్లో 621 బస్సులు 12 మీటర్ల పొడవు గలవి కాగా 129 బస్సులు 9 మీటర్ల పొడవు కలిగి ఉన్నాయి. వీటికి అదనంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరానికి కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ టెండర్-III కింద మరో 300 ఈ-బస్సులను ప్రత్యేకంగా కేటాయించడం గమనార్హం.
ఈ-బస్సుల నిరంతర నిర్వహణ కోసం అన్ని డిపోలలో సమాంతరంగా “బిహైండ్ ది మీటర్” ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కేంద్ర శాంక్షనింగ్ అండ్ స్టీరింగ్ కమిటీ ఆమోదంతో అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం రూ.89.9 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో హైటెన్షన్ పవర్ కనెక్టివిటీ, ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ నెట్‌వర్కులు, డిపో స్థాయి పవర్ మేనేజ్‌మెంట్ సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.79.9 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఇందులో భాగంగా సింహపురి, గాజువాక, కాకినాడ, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పనుల కోసం ఇప్పటికే రూ.17.8 కోట్లు విడుదల చేసి, మార్చి 16న ఆ నిధులను ఏపీ ట్రాన్స్‌కో మరియు సంబంధిత డిస్కంలకు బదిలీ చేశారు.
ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల సమన్వయంతో హైటెన్షన్ కనెక్టివిటీ పనులు వేగంగా సాగుతున్నాయి. అలాగే 12 డిపోలలో లోటెన్షన్ మౌలిక సదుపాయాల టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, మే 5న లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్' జారీ చేసిన అనంతరం పనులను ఒకేసారి ప్రారంభించారు. ఏపీఎస్‌ఆర్టీసీ, కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల పరస్పర సమన్వయంతో ఈ భారీ ఈ-మొబిలిటీ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని విజయానంద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సరికొత్త రవాణా వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ సుస్థిర పట్టణ రవాణాకు బాటలు వేయడమే కాకుండా, గ్రీన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచి, విద్యుత్ మొబిలిటీలో అగ్ర రాష్ట్రాల సరసన చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
