
కర్నూలులో డ్రోన్ ఆధారిత గైడెడ్ మిస్సైల్ ప్రయోగాలు విజయవంతం
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) స్వదేశీ రక్షణ సామర్థ్యాల పెంపులో మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 'ఆత్మనిర్భర్ భారత్' పిలుపులో భాగంగా పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్ ఆధారిత అన్‌మ్యాండ్ ప్రిసిషన్ గైడెడ్ మిస్సైల్ (యూఎల్పీజీఎం-వీ3) తుది అభివృద్ధి ట్రయల్స్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సమీపంలో ఉన్న డీఆర్‌డీఓ టెస్ట్ రేంజ్‌లో ఈ క్షిపణి పరీక్షలను నిర్వహించారు. ఇవి ఎయిర్-టు-గ్రౌండ్ (గగనతలం నుంచి భూతలానికి) ఎయిర్-టు-ఎయిర్ (గగనతలం నుంచి గగనతలానికి) అనే రెండు మోడ్‌లలో విజయవంతంగా సాగాయి. ఈ ప్రయోగాల సమయంలో మిస్సైల్ వ్యవస్థను అత్యాధునిక 'ఇంటిగ్రేటెడ్ గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్స (జీసీఎస్) ద్వారా నిర్వహించారు. ఇది క్షిపణి ప్రయోగాన్ని, కార్యాచరణ సన్నద్ధతను పూర్తిగా ఆటోమేట్ చేస్తుంది. వేర్వేరు యుద్ధ వాతావరణ పరిస్థితులలో లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యాన్ని, నమ్మకత్వాన్ని ఈ క్షిపణి నిరూపించుకుంది.
హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) ఇతర డీఆర్‌డీఓ లాబొరేటరీలతో కలిసి ఈ అధునాతన క్షిపణిని రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ తయారీలో దేశీయ ఎంఎస్ఎమ్ఈలు, ప్రైవేట్ పరిశ్రమలు భాగస్వామ్యం వహించాయి. ఈ మిస్సైల్ సిస్టమ్ భారీ ఉత్పత్తి కోసం డీఆర్‌డీఓ సంస్థ.. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థలతో చేతులు కలిపింది. ఈ విజయవంతమైన ట్రయల్స్ కోసం క్షిపణిని 'న్యూస్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్' సంస్థ అభివృద్ధి చేసిన మానవరహిత డ్రోన్ల కు అనుసంధానించారు.
వ్యూహాత్మక మైలురాయి
ఈ అద్భుత విజయానికి గాను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను, పీఎస్‌యూలను, రక్షణ ఉత్పత్తి భాగస్వాములను అభినందించారు. ఈ క్షిపణి ఎయిర్-టు-గ్రౌండ్ మోడ్‌లో శత్రువుల ట్యాంకులను ధ్వంసం చేయడానికి, ఎయిర్-టు-ఎయిర్ మోడ్‌లో ప్రత్యర్థి డ్రోన్లు, హెలికాప్టర్లు, ఇతర గగనతల లక్ష్యాలను కూల్చివేయడానికి అద్భుతంగా పనిచేస్తుందని ఆయన కొనియాడారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించే దిశగా ఇది ఒక "వ్యూహాత్మక మైలురాయి" అని రక్షణ మంత్రి అభివర్ణించారు. ఈ పరీక్షలు పూర్తి కావడంతో ఈ క్షిపణి వ్యవస్థల అధికారిక ఉత్పత్తికి మార్గం సుగమమైంది.
