
బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్:ఏపీ సీఎం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందించారు. సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ సాధించిన ఈ విజయాన్ని అసాధారణమైనదని ఆయన అభివర్ణించారు.
శనివారం కోల్‌కతాలో జరిగిన సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బెంగాల్ అభివృద్ధిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "బెంగాల్‌కు అపారమైన మానవ వనరులు, జ్ఞాన సంపత్తి, సహజ వనరులు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే కూటమి అధికారంలో ఉండటం వల్ల (డబుల్ ఇంజిన్ సర్కార్) అభివృద్ధి అనేది ఆటోపైలట్‌ల నడిచే కారులా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
సువేందు నాయకత్వానికి కితాబు
రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారిని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పట్టువదలకుండా పోరాడి, మమతా బెనర్జీపై విజయం సాధించడం ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనమని కొనియాడారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకున్నారని ఈ కొత్త ప్రభుత్వం వారి ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా గత 15 ఏళ్ల పాలనలో బెంగాల్ ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావిస్తూ ఈ విజయం ఆ రాష్ట్రంలో కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలుకుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మొత్తం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఇప్పుడు బెంగాల్ కూడా ఆ ప్రయాణంలో భాగస్వామి కావడం శుభపరిణామమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, అమిత్ షా వంటి అగ్రనేతలతో కలిసి పాల్గొన్న చంద్రబాబు, తెలుగు రాష్ట్రాల తరపున నూతన ప్రభుత్వానికి తన మద్దతును ప్రకటించారు.
