
క్రీడల్లో డోపింగ్‌కు పాల్పడితే ఇక ‘క్రిమినల్’ చర్యలే!
క్రీడల ముసుగులో నిషేధిత ఉత్ప్రేరకాలను ప్రోత్సహించే వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. క్రీడాకారులకు నిషేధిత మందులను సరఫరా చేసినా లేదా వాటిని వాడేలా ఒత్తిడి తెచ్చినా.. అటువంటి వారిని ఇకపై నేరస్తులుగా పరిగణిస్తూ క్రిమినల్ చర్యలు చేపట్టేలా కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) గ్లోబల్ యాంటీ డోపింగ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ నెట్‌వర్క్ ముగింపు సదస్సులో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
డోపింగ్ మహమ్మారిపై ఉక్కుపాదం
ప్రపంచవ్యాప్తంగా డోపింగ్ (నిషేధిత మందుల వాడకం) కేసుల్లో గత మూడేళ్లుగా భారత్ మొదటి స్థానంలో ఉండటంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడల్లో గెలవడానికి అక్రమ మార్గాల్లో మందులు వాడటం అనేది కేవలం ఒక్క క్రీడాకారుడు చేసే తప్పు మాత్రమే కాదని, దీని వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ ముఠా హస్తం ఉందని ఆయన పేర్కొన్నారు. 2036లో ఒలింపిక్ క్రీడలను మన దేశంలో నిర్వహించుకోవాలని భారత్ కలలు కంటోందని, ఇలాంటి డోపింగ్ అక్రమాలు ఆ ఆశయానికి అడ్డుపడే అవకాశం ఉందన్నారు. అందుకే ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త చట్టాలను తీసుకువస్తున్నామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
కోచ్‌లు, సిబ్బందికి ఇక జైలు శిక్ష?
ప్రస్తుతం దేశంలో నిషేధిత ఉత్ప్రేరకాల వినియోగానికి సంబంధించి కేవలం క్రీడల పరంగా నిషేధాలు మాత్రమే ఉన్నాయి. అయితే దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు ఇవి సరిపోవని మాండవీయ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా క్రీడాకారుల వెనుక ఉండే సపోర్ట్ స్టాఫ్, కోచ్‌లు నిషేధిత మందుల రవాణాలో, వినియోగంలో పాలుపంచుకున్నట్లు తేలితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చట్టపరమైన నిబంధనలను రూపొందిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. పెరిగిన పోటీ తత్వం కారణంగా క్రీడాకారులు దారి తప్పుతున్నారని, అటువంటి సమయాల్లో నైతిక విలువలను కాపాడటమే తమ ప్రాధాన్యతని పేర్కొన్నారు.
తగ్గుముఖం పట్టిన ఉల్లంఘనలు
దేశంలో డోపింగ్ నియంత్రణ కోసం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని కేంద్ర మంత్రి మాండవీయ వివరించారు. 2019లో సుమారు 4,000 డోపింగ్ పరీక్షలు నిర్వహించగా, గతేడాది ఆ సంఖ్యను 8,000కు పెంచినట్లు తెలిపారు. పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ, ఉల్లంఘనల శాతం గణనీయంగా తగ్గడం విశేషం. 2019లో 5.6 శాతంగా ఉన్న 'అడ్వర్స్ అనలిటికల్ ఫైండింగ్స్' ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువకు పడిపోయిందని ఆయన వివరించారు. క్రీడాకారులకు ఏ మందులు వాడాలి, ఏవి వాడకూడదనే విషయంపై ముందుగానే అవగాహన కల్పించడం వల్లే, వారు తెలియక చేసే తప్పులను అరికట్టగలుగుతున్నామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ధీమా వ్యక్తం చేశారు.
