
దేశాన్ని విభజించే ప్రయత్నం చేయొద్దు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్
హైడ్రా పేరు వెనుక నాజీ నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తనకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాంతీయ ప్రాతిపదికన దేశాన్ని విభజించేలా, ఆధునిక భారతదేశ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి పూర్తి భిన్నంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ మేరకు కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) లో స్పందిస్తూ.. వాహ్... కాంగ్రెస్ ముఖ్యమంత్రికి హిట్లర్ అంటే అపారమైన స్ఫూర్తి! ఒకవేళ ఇదే మాట బీజేపీకి చెందిన ఏ ముఖ్యమంత్రి అయినా అని ఉంటే, ఈ పాటికి సదరు ప్రతిపక్షాలు అంతా నాజీజం, ఫాసిజం అంటూ దేశమంతటా ఆందోళన వ్యక్తం చేసేవారు కదా.. అని ఎద్దేవా చేశారు. రాజకీయ విమర్శలు చేయడం ప్రజాస్వామ్యానికి ఒక నిదర్శనమే అయినప్పటికీ, నిరంతరం ఇలాంటి విభజన, రెచ్చగొట్టే భాషను ఉపయోగించడం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియ బలోపేతం కాకపోగా జాతీయ సమగ్రత దెబ్బతింటుందని ఆయన హితవు పలికారు.
భారతదేశం ఒక్కటే – విపక్షాల విభజన రాజకీయం
ఇటీవల కాలంలో కొందరు ప్రతిపక్ష నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ‘ఉత్తర-దక్షిణ’ విభేదాలను కృత్రిమంగా సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని రిజిజు ఆరోపించారు. భారతదేశ రాజ్యాంగ నాయకత్వమే దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. “దేశాన్ని విభజించడానికి ప్రయత్నించవద్దు. మనమంతా భారతీయులం. తూర్పు భారతదేశంలోని ఒడిశాకు చెందిన ఒక నిరాడంబరమైన, అంకితభావం గల గిరిజన నాయకురాలు మన రాష్ట్రపతి. పశ్చిమ భారతదేశంలోని గుజరాత్‌కు చెందిన ఒక దూరదృష్టి గల నాయకుడు మన ప్రధాన మంత్రి. అలాగే దక్షిణ భారతదేశంలోని తమిళనాడుకు చెందిన ఒక సామాన్య వ్యక్తి మన ఉపరాష్ట్రపతి” అని ఆయన గుర్తుచేశారు.
వివాదానికి నేపథ్యం
బెంగళూరులో శనివారం జరిగిన ఒక మీడియా సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జర్మన్ కి చెందిన హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన పదం ‘హైడ్రా’ అని, ఎవరినైనా హతమార్చగల అతని ప్రధాన బృందాన్ని అలా పిలిచేవారని పేర్కొన్నారు. దాని నుంచి స్ఫూర్తి పొందే తాము ఈ టాస్క్ ఫోర్స్‌కు ‘హైడ్రా’ అని పేరు పెట్టామని, ఇందులో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో పాటు 3,000 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని ఉంచినట్లు తెలిపారు. నేడు తన రాష్ట్రంలో జలవనరులను ఆక్రమించడానికి ఎవరైనా ధైర్యం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దేశ ప్రధాని, రాష్ట్రపతి ఇద్దరూ ఉత్తర భారతదేశం నుంచే ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తూ, ఢిల్లీకి పన్నులు కడుతూ దక్షిణ రాష్ట్రాలు ఎందుకు ‘సెకండ్ గ్రేడ్’ పౌరులుగా బతకాలని వ్యాఖ్యానించడం కూడా ఇక్కడ గమనార్హం.
ప్రస్తుతం హైడ్రా పనితీరు న్యాయస్థానం పరిశీలనలో ఉంది. ముందస్తు షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా, తెల్లవారుజామున, వారాంతాల్లో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది, అక్కడ “యుద్ధ వాతావరణం” నెలకొందని వ్యాఖ్యానించింది. మున్సిపల్ చట్టాల ప్రకారం సరైన ప్రామాణిక కార్యాచరణ విధానాలు కోర్టు ముందు ఉంచే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించారు. అలాగే కోర్టు స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ కూల్చివేసిన నిర్మాణాలను వెంటనే పునర్నిర్మించాలని ఆదేశిస్తూనే, చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వ రోడ్లు, నాలాలు, చెరువులలోని ఆక్రమణలను మాత్రం తొలగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య హైడ్రా, హిట్లర్ వ్యాఖ్యల వివాదం తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది.
