Let's talk: editor@tmv.in
అనుమానంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవొద్దు: కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి

అనుమానంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవొద్దు: కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి

Gaddamidi Naveen
20 మే, 2026

కేవలం అనుమానంతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రవర్తించడాన్ని ఎంతమాత్రం సమర్థించలేమని టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్ పరిధిలో ఆవుల అక్రమ రవాణా జరుగుతోందనే అనుమానంతో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై ఆయన స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కడ రోడ్డు పక్కన ఆపి ఉన్న ఒక లారీపై తార్పాలిన్ కప్పి ఉండటంతో, అందులో ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో కొందరు వ్యక్తులు లారీ యజమానితో గొడవకు దిగారన్నారు. లారీలో కేవలం ప్లైవుడ్ షీట్లు మాత్రమే ఉన్నాయని యజమాని చెబుతున్నప్పటికీ.. వినకుండా కొందరు వాహనాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని ఆ లారీని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించగా, కొన్ని వర్గాలు వారిని వెంబడించడంతో అక్కడ చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుందని వివరించారు.

రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూసే ఎవరినీ ఈ ప్రభుత్వం వదిలిపెట్టదని సామ రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ప్రజల భద్రత, రక్షణ, వారి ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎలాంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.

ఆసిఫ్ నగర్‌లో అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. శనివారం అర్ధరాత్రి వేళ ఆసిఫ్ నగర్ ప్రాంతంలో ఒక లారీని ఆవుల అక్రమ రవాణా అనుమానంతో ఒక వర్గం వారు అడ్డుకున్నారు. అయితే అవతలి వర్గం వారు అందులో ప్లైవుడ్ మాత్రమే ఉందని వాదించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి, పరస్పరం దాడులు, రాళ్లు విసురుకునేవరకు దారితీసింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందిన వెంటనే భారీగా పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని, గుంపును చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన తర్వాత ఏఐఎంఐఎం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని ఆసిఫ్ నగర్ పోలీసులు వెల్లడించారు.