

నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు: డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌తో పాటు ఇతర ప్రముఖుల వాహనాల రాకపోకల సమయంలో సాధారణ ప్రజల ప్రయాణానికి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి డీజీపీ సి.వి. ఆనంద్‌ను బుధవారం ఆదేశించారు.
తన ప్రయాణం కోసం ప్రజలను గంటల తరబడి రోడ్లపై వేచి ఉండేలా చేయడం సరైనది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజల నిత్యజీవితానికి ఇబ్బందులు కలిగించే విధంగా ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లే సమయంలో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడిన ఘటనపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ఆయన తీవ్రంగా పరిగణిస్తూ, ట్రాఫిక్ నిర్వహణలో జరిగిన లోపాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. కాన్వాయ్ ఏర్పాట్ల కారణంగా సాధారణ ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. కాన్వాయ్ వెళ్లేటప్పుడు వ్యతిరేక దిశలో వచ్చే వాహనాలను అనవసరంగా ఆపవద్దని, సాధ్యమైనంత వరకు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలే తప్ప, పూర్తిగా నిలిపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని స్పష్టం చేశారు.
డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష
ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డీజీపీ సి.వి. ఆనంద్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల ఎస్ఐ స్థాయి, అంతకంటే పైస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణను బలోపేతం చేసేందుకు ఒక అడిషనల్ డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక 'ట్రాఫిక్ బ్యూరో'ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కాన్వాయ్ కదలికల సమయంలో వాహనాలను పూర్తిగా నిలిపివేయకుండా సాఫీగా రెగ్యులేషన్ చేయాలని, రద్దీ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని అధికారులను కోరారు. ముఖ్యంగా విమానాశ్రయాల వద్ద నిఘా పెంచాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు దీన్ని అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
వర్షాకాలం, పార్కింగ్ నియంత్రణ
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, తద్వారా ట్రాఫిక్ జాప్యాన్ని నివారించాలని డీజీపీ ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సత్వర నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు. అలాగే, ఔటర్ రింగ్ రోడ్డు పై అక్రమ పార్కింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇకపై సామాన్య ప్రజలకు వీఐపీ కాన్వాయ్ కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
