

పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా.. మీ చుట్టూ ఉన్న పర్యావరణం నుంచి నేర్చుకోండి: రాష్ట్రపతి
వేగంగా మారుతున్న ప్రపంచంలో విద్యార్థులు తమ ఉనికిని చాటుకోవడానికి, రాణించడానికి నైపుణ్యాభివృద్ధిలో వస్తున్న సరికొత్త ధోరణులకు అనుగుణంగా ఎదగాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. కేవలం పాఠ్యపుస్తకాల చదువులకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి తమ చుట్టూ ఉన్న పర్యావరణం నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు.
మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో అనుసంధానమై ఉంటూనే.. దేశ భవిష్యత్తును మరింత మెరుగుపరచడానికి కృషి చేయాలన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో.. మన దేశ వారసత్వాన్ని కాపాడుకుంటూనే, ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఫలాలను సమాజంలోని ప్రతి వర్గానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రపతి నొక్కిచెప్పారు.
ఉత్తరాంధ్ర గిరిజనుల కోసం 'సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్'
గిరిజనుల సాధికారతను కాంక్షిస్తూ ఈ విశ్వవిద్యాలయం ఉత్తరాంధ్ర ప్రాంతంలోని గిరిజన సమాజాల కోసం ప్రత్యేకంగా ఒక ‘సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్’ ను నిర్వహిస్తోందని రాష్ట్రపతి తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తోందని కొనియాడారు. దేశంలోని గిరిజన యువత సమాజంలో సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన మార్పులు తీసుకురావడానికి, అభివృద్ధి సాధించడానికి మానసికంగా సిద్ధం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
గిరిజన సంక్షేమం, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, ఆహార, పోషకాహార భద్రత, ఇంధన పరిరక్షణ వంటి కీలక రంగాలపై వర్సిటీ ప్రత్యేక దృష్టి సారించిందని. ఈ ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలు సమసమాజ స్థాపనకు, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనకు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక విద్యతో గిరిజన ప్రజలను అనుసంధానించడం ద్వారా స్థానిక యువత దేశ సమాన అభివృద్ధిలో భాగస్వాములు కాగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, విధాన రూపకల్పన సామర్థ్యాలను పెంపొందించే ప్రధాన కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయం ఎదగాలని ఆకాంక్షించారు.
సామాజిక న్యాయం ధ్యేయంగా ఏర్పాటైన విద్యాసంస్థలు తమ ప్రాంతంలోని గిరిజన సమాజాల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, అటవీ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ముఖ్యంగా గిరిజన విశ్వవిద్యాలయాలు గిరిజనుల సాంప్రదాయ వృత్తులైన అటవీ ఉత్పత్తుల సేకరణ, హస్తకళలు, చిరుధాన్యాల సాగు, ఔషధ మొక్కల పెంపకం, ఎకో టూరిజం స్థానిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు వినూత్నమైన ఆవిష్కరణలను తీసుకురావాలని సూచించారు.
ప్రభుత్వ ప్రయత్నాలను నిజం చేద్దాం
కాన్వొకేషన్ అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ఒక ‘ముఖ్యమైన మైలురాయి’ అని, ఇది కేవలం సంబరాల రోజే కాకుండా భవిష్యత్తు కోసం బలమైన తీర్మానాలు చేసుకునే సందర్భమని రాష్ట్రపతి అన్నారు. పట్టభద్రులైన విద్యార్థులు దేశంలో అందరికీ సమానమైన, సమగ్రమైన అభివృద్ధిని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని రాష్ట్రపతి కోరారు. ఈ రోజు గిరిజనులు, ఆదివాసీల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ మద్దతుకు ప్రతిఫలంగా మన బాధ్యత ఏమిటి? అందుకే, ఈ రోజు నుంచి మనకోసం మాత్రమే కాకుండా.. సమాజం, విద్య, సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక వ్యవస్థలో మార్పులు తెచ్చి సమాజాన్ని ముందుకు నడిపించడానికి మనం మానసికంగా సిద్ధం కావాలని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందేలా, ఏ ఒక్కరూ వెనుకబడిపోకుండా ఉండేలా పట్టభద్రులైన విద్యార్థులు దేశ ప్రగతికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొని ప్రసంగించారు. విశాఖలోని ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రులు లోకేశ్, అనిత, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
