Let's talk: editor@tmv.in
తాగునీటి నాణ్యతపై రాజీపడొద్దు:ఏపీ డిప్యూటీ సీఎం

తాగునీటి నాణ్యతపై రాజీపడొద్దు:ఏపీ డిప్యూటీ సీఎం

Panthagani Anusha
22 మే, 2026

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా తాగునీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రామాల్లోని ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లోగా శుభ్రం చేయాలని ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా జిల్లా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. బుధవారం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన జలజీవన్ మిషన్ పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు.

భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, లవణీయత వంటి హానికర ఖనిజాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాలను శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో గుర్తించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో అధునాతన వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి కేవలం తాగడానికే కాకుండా వంట, స్నానం, దుస్తులు ఉతకడం వంటి అన్ని గృహ అవసరాలకు కూడా పూర్తిగా శుద్ధి చేసిన నీటినే సరఫరా చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. కలుషిత నీటి వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖను సమన్వయం చేసుకుంటూ నిర్దిష్ట కాలపరిమితితో యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని బాధిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల వసతి గృహాలు (హాస్టళ్లు), అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి నాణ్యతను నిరంతరం పరిశీలించడానికి ప్రత్యేకంగా ఎఫ్టీకే కిట్లను అందుబాటులో ఉంచాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. చిన్నపిల్లలు, విద్యార్థుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదేవిధంగా తాగునీటి కొరత తీవ్రంగా ఉన్న గ్రామాలను తక్షణమే గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కేబినెట్ ఆమోదం తెలిపిన 3 వేల నీటి ఎద్దడి గ్రామాల్లో తాగునీటి పనులను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలన్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో తానే స్వయంగా పర్యటించి ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుంటానని అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు, సహాయాన్ని కోరతామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రకటించారు.

మరోవైపు ప్రస్తుతం పురోగతిలో ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల మల్టీ విలేజ్ స్కీమ్స్ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని పనుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రతి నెలా ఒక టార్గెట్ నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలని ఈ ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి నెలా తానే స్వయంగా ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. దీంతో పాటు ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన మరో 7 మల్టీ విలేజ్ స్కీమ్స్ తాగునీటి పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.