Let's talk: editor@tmv.in
పంట అవశేషాలను కాల్చొద్దు:

పంట అవశేషాలను కాల్చొద్దు:

Panthagani Anusha
17 మే, 2026

వ్యవసాయ భూముల్లో పంట కోత అనంతరం మిగిలిపోయే పంట అవశేషాలను కాల్చివేయడం వల్ల భూసారం, పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డా.బి.గోపి పేర్కొన్నారు. తాత్కాలిక సౌలభ్యం కోసం రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం దీర్ఘకాలంలో భారీ ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), వ్యవసాయ అధికారులు (ఏఓలు) రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలపై గ్రామస్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆయన సూచించారు.

పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు అమూల్యమైన సూక్ష్మ పోషకాలు పూర్తిగా నశించి భూమి నిస్సారంగా మారుతుందని డా. గోపి వివరించారు. భూమికి మేలు చేసే వానపాములు, మిత్ర పురుగులు మంటల్లో నశించడం వల్ల నేల జీవసత్తువ తగ్గి, పంట దిగుబడులు క్రమంగా పడిపోతాయని పేర్కొన్నారు. అదేవిధంగా పంట వ్యర్థాల దహనం వల్ల కార్బన్ మోనాక్సైడ్‌ వంటి హానికర వాయువులు విడుదలై గాలి కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని దీని ప్రభావంతో ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు పెరిగే అవకాశం ఉందని ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. రోడ్ల పక్కన పొగమంచు ఏర్పడి దృశ్యమానత తగ్గడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రైతులు పంట అవశేషాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని ఆయన సూచించారు. రోటావేటర్‌, శ్రెడర్‌ వంటి ఆధునిక యంత్రాలతో పంట అవశేషాలను భూమిలోనే కలియదున్నాలని తెలిపారు. అదేవిదంగాయూరియా, సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ లేదా డీకంపోజర్‌ వినియోగించి పంట వ్యర్థాలను త్వరగా సేంద్రియ ఎరువుగా మార్చుకోవచ్చని దీనివల్ల రసాయన ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుందని అంతేకాకుండా పంట వ్యర్థాలను కంపోస్ట్‌, వర్మీ కంపోస్ట్‌ తయారీకి పశుగ్రాసంగా, మల్చింగ్‌ కోసం వినియోగించి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. ప్రతి మంగళవారం నిర్వహించే “రైతు నేస్తం” కార్యక్రమాల్లో పంట అవశేషాల నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 మరియు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్‌. నెం.27, తేదీ 10-07-2017 ప్రకారం పంట అవశేషాలను బహిరంగంగా కాల్చినట్లయితే రూ.5,000 వరకు పర్యావరణ పరిహారం (జరిమానా) విధించే నిబంధనలు అమలులో ఉన్నాయని డా. గోపి స్పష్టం చేశారు.