
డీఎంకే 'చెన్నై సూపర్-6' మేనిఫెస్టో విడుదల
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదివారం చెన్నైలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. డ్రావిడియన్ మోడల్ 2.0లో భాగంగా చెన్నై నగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు "చెన్నై సూపర్-6" పేరుతో ఆరు ప్రధాన హామీలను ప్రకటించారు.
అన్నా అరివాలయం ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అభ్యర్థుల సమక్షంలో స్టాలిన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. మౌలిక సదుపాయాలు, రవాణా, ఉపాధి, ప్రజా సౌకర్యాల మెరుగుదలే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించారు. అర్బన్ హ్యాబిటాట్ డెవలప్‌మెంట్ బోర్డ్ నివాసాల్లో ప్రాథమిక వసతులను మెరుగుపరుస్తారు.మెట్రో నీటి సౌకర్యం లేని ప్రాంతాలకు ఆర్ఓ శుద్ధి చేసిన తాగునీరు అందిస్తారు. నివాస ప్రాంతాల్లో హై-ఇంటెన్సిటీ వీధి దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు, కళలు, సంగీతం కోసం ప్రపంచ స్థాయి సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 'లాస్ట్ మైల్ కనెక్టివిటీ'ని పెంచేందుకు 1,000 కొత్త మినీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణ సమయాన్ని 25 శాతం తగ్గించేందుకు కృత్రిమ మేధస్సు ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఎన్నూరు నుంచి పూంజేరి వరకు చెన్నై పెరిఫెరల్ రోడ్డును 2027 నాటికి, మెట్రో రైలు విస్తరణ, డ్రైనేజీ పనులను 2028 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2029 నాటికి వెడల్పైన ఫుట్‌పాత్‌లు, నీడను ఇచ్చే చెట్లతో కూడిన రహదారులను నిర్మిస్తారు. జంతు జనన నియంత్రణ కార్యక్రమాన్ని విస్తరిస్తారు. పశువైద్యుల సంఖ్యను మూడు రెట్లు పెంచి, ఎన్జీవోల సహకారంతో అదనపు షెల్టర్లను ఏర్పాటు ఉన్నాయి. రూ.10,000 కోట్ల పెట్టుబడితో ఏఐ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ రంగాల కోసం గ్లోబల్ కేంద్రాన్ని ఏర్పాటు ఉన్నాయి.
ఈ టెక్నాలజీ హబ్ ద్వారా సుమారు 20,000 మందికి భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాల హామీ. పరిశోధన సౌకర్యాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా చెన్నైని అంతర్జాతీయ ఉపాధి కేంద్రంగా మార్చడం. మొత్తంమీద, స్టాలిన్ ప్రకటించిన ఈ ప్రణాళిక చెన్నైని సాంకేతిక, సాంస్కృతిక రాజధానిగా నిలబెట్టే దిశగా ఒక సమగ్ర రోడ్‌మ్యాప్‌గా కనిపిస్తోంది.
