
జిల్లా కలెక్టర్ తక్షణ స్పందన.. దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ
సమస్యలతో తన వద్దకు వచ్చిన ఇద్దరు దివ్యాంగుల కష్టాలను చూసి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మానవత్వంతో తక్షణమే స్పందించారు. వారి రవాణా ఇబ్బందులను గమనించి, అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం చూపుతూ అండగా నిలిచారు.
సోమవారం వివిధ ప్రభుత్వ పనుల నిమిత్తం కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఉప్పుల శ్రీనివాస్, ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కొమిరె పరశురాములు సమగ్ర జిల్లా కార్యాలయాల సముదాయానికి వచ్చారు. అక్కడ వారిని గమనించిన జిల్లా కలెక్టర్ స్వయంగా వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను ఎంతో ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
అక్కడికక్కడే తక్షణ సహాయం
శారీరక వైకల్యం కారణంగా తాము బయట తిరగడానికి, దైనందిన పనులు చేసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఆ దివ్యాంగులు కలెక్టర్‌కు వివరించారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న కలెక్టర్ గరిమా అగర్వాల్, వెంటనే స్పందించి జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు. ఇద్దరు లబ్ధిదారులకు తక్షణమే బ్యాటరీతో నడిచే ముడు చక్రాల సైకిళ్లను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసిన అధికారులు, ఆ ఇద్దరు దివ్యాంగులకు కలెక్టర్ చేతుల మీదుగానే బ్యాటరీ ట్రైసైకిళ్లతో పాటు రక్షణ కోసం హెల్మెట్లను కూడా అందజేశారు.
కలెక్టర్‌కు కృతజ్ఞతలు
తమ బాధను అర్థం చేసుకుని, క్షణాల వ్యవధిలో స్పందించి వాహనాలను అందజేసిన కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు లబ్ధిదారులు శ్రీనివాస్, పరశురాములు చేతులు జోడించి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాయం తమ జీవితంలో మరిచిపోలేమని, తమకు ఎంతో సమయస్ఫూర్తితో కూడిన మద్దతు లభించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.
