
నేడు 1,919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల పంపిణీ
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నేడు (మంగళవారం) రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు.
ఈ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో సాయంత్రం 4 గంటలకు జరగనుంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా భర్తీ చేసిన మొత్తం పోస్టుల్లో, వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు సాధించిన 1,919 మంది అభ్యర్థులకు ఈ రోజు ఉత్తర్వులు అందజేస్తారు. కాగా, కార్మిక శాఖలోని 257 పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
నియామక పత్రాలు అందుకునేందుకు వచ్చే నర్సులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి దామోదర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జెడ్. చోంగ్తూ ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఆరోగ్య రంగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భారీ నియామక ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
