
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి: కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాలా అండగా ఉంటుందని, కాబట్టి దివ్యంగ పిల్లలు ఎలాంటి నిరాశకు లోనుకాకుండా పూర్తి ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. దివ్యాంగులైన పిల్లలను ఎంతో ఓపికతో, ప్రేమతో పెంచుతున్న వారి తల్లిదండ్రులు నిజంగా ధన్యులని, వారి బాధ్యత ఎంతో గొప్పదని ఆమె కొనియాడారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహ ఆవరణలో బుధవారం భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ, విద్యా శాఖ సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజలు చేసి, జ్యోతి ప్రజ్వలనతో వేడుకను ప్రారంభించారు.
దివ్యాంగుల చదువు, ఎదుగుదల ఆగకూడదు
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. శారీరక లోపాలు ఉన్నప్పటికీ దివ్యంగ పిల్లల చదువు, వారి భవిష్యత్తు ఎదుగుదల ఎక్కడా ఆగకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దివ్యంగ పిల్లలకు ఎలాంటి అవసరాలు ఉన్నా, సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకువస్తే.. వాటిని ప్రభుత్వ పరంగా తక్షణమే పరిష్కరించి, అవసరమైన సాయం అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
