Let's talk: editor@tmv.in
ఏపీలో నేటి నుంచి డిజిటల్ జనగణన

ఏపీలో నేటి నుంచి డిజిటల్ జనగణన

Shaik Mohammad Shaffee
16 ఏప్రిల్, 2026

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ‘జనగణన 2027’ ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పూర్తిస్థాయిలో డిజిటల్ ఫార్మాట్‌లో జరగనున్న ఈ సెన్సస్ ప్రక్రియకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగణన కార్యకలాపాల సంచాలకుడు జె. నివాస్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ భారీ ప్రక్రియ రెండు దశల్లో సాగుతుందని, ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని కచ్చితమైన వివరాలను నమోదు చేయాలని ఆయన కోరారు.

తొలి దశలో ఇళ్ల లెక్కలు

జనగణనలో భాగంగా నేటి నుంచి ప్రారంభమయ్యే తొలి దశలో ‘హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్’ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఇళ్లు, భవనాల సంఖ్యను లెక్కిస్తారు. దీని ద్వారా భవిష్యత్తులో జరగబోయే జనాభా గణనకు అవసరమైన మానవ వనరులు, రవాణా సౌకర్యాలను అంచనా వేస్తారు. రెండో దశలో ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించే ‘పాపులేషన్ సెన్సస్’ ఉంటుంది. గణన విధులకు ఆటంకం కలిగించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నివాస్ హెచ్చరించారు.

నివాస స్థితిగతులపై ఆరా

ఈసారి డిజిటల్ జనగణనలో సేకరించే వివరాలు గతంతో పోలిస్తే మరింత సమగ్రంగా ఉండనున్నాయి. ప్రధానంగా గృహాల స్థితిగతులు, అందుబాటులో ఉన్న వసతుల గురించి ఈ దశలో సమాచారం సేకరిస్తారు. నివాస రకం, తాగునీటి సౌకర్యం, విద్యుత్ కనెక్షన్, పారిశుధ్యం, వంట కోసం ఎల్పీజీ/కట్టెలు వంటి ఇంధన వినియోగంపై ఆరా తీస్తారు.

ఆస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువుల నమోదు

ప్రజల ఆర్థిక స్థితిగతులను, డిజిటల్ వినియోగాన్ని అంచనా వేయడానికి ఆస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల వివరాలను కూడా సేకరిస్తారు. ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం, ల్యాప్‌టాప్/కంప్యూటర్ వినియోగం వంటి డిజిటల్ కనెక్టివిటీతో పాటు.. మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్ల వాడకం గురించి అడుగుతారు. అలాగే టీవీ, రేడియో వంటి మీడియా పరికరాలు, సైకిల్, మోటార్ సైకిల్, కార్ల వంటి వాహనాల వివరాలను కూడా ఎన్యూమరేటర్లు నమోదు చేస్తారు.

వ్యక్తిగత సమాచార సేకరణ

రెండో దశలో నిర్వహించే జనాభా గణనలో వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. పేరు, వయస్సు, లింగం, వైవాహిక స్థితితో పాటు విద్య, వృత్తిపరమైన వివరాలను (అక్షరాస్యత, చదువుకున్న స్థాయి, చేసే పని) నమోదు చేస్తారు. సామాజిక వివరాలైన మతం, కులం (ఎస్సీ/ఎస్టీలకు సంబంధించినవి), మాట్లాడే భాషలు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస రావడానికి గల కారణాలను కూడా ఈ దశలో సమగ్రంగా విశ్లేషిస్తారు.

సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు వెసులుబాటు

ఈ సమాచారమంతా ఎన్యూమరేటర్లు నేరుగా తమ మొబైల్ ఫోన్లు/టాబ్లెట్‌లలోనే నమోదు చేస్తారు. ఇది నేరుగా సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానం కావడం వల్ల డేటా ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది. విశేషమేమిటంటే ఈసారి ప్రజలు తమ వివరాలను ప్రభుత్వ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు. ప్రజలు అందించే డేటా గోప్యత విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయిలో విస్తృత ఏర్పాట్లు

ఈ భారీ ప్రక్రియ కోసం గత ఏడాది నవంబర్‌లోనే విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో ‘ప్రీ-టెస్ట్’ నిర్వహించారు. జనవరి 1, 2026 నాటికే పరిపాలన విభాగాల (జిల్లాల సరిహద్దులు) ఫ్రీజింగ్ ప్రక్రియ పూర్తయిందని, ఫీల్డ్ అధికారుల నియామకం కూడా ముగిసిందని అధికారులు వివరించారు. రాష్ట్రంలోని 28 జిల్లాలు, 688 మండలాలు, 123 మున్సిపాలిటీలు, 99 సెన్సస్ టౌన్లు మరియు 16,862 గ్రామాల్లో ఈ గణన ఏకకాలంలో జరగనుంది.

అభివృద్ధికి దిక్సూచిగా గణాంకాలు

సంక్షేమ పథకాల రూపకల్పన, మౌలిక సదుపాయాల కల్పన, వనరుల కేటాయింపులో ఈ గణాంకాలు అత్యంత కీలకం కానున్నాయి. పాలనలో పారదర్శకత కోసం ఈ డిజిటల్ సమాచారం దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో నోడల్ అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు జె. నివాస్ వెల్లడించారు.