Let's talk: editor@tmv.in
నీట్ రీ-ఎగ్జామ్‌పై ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

నీట్ రీ-ఎగ్జామ్‌పై ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Gaddamidi Naveen
22 జూన్, 2026

నీట్-యూజీ పరీక్ష రీ-ఎగ్జామ్‌ నేపథ్యంలో గతంలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకల కారణంగా విద్యార్థులు ఎదుర్కొన్న మానసిక వేదన మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో జరిగిన ఘటనల వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, ఈసారి పరీక్షను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం ఉండాలని ఆయన అన్నారు. గత ఘటనల కారణంగా ఇప్పటికే 11 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు నీట్-యూజీ రీ-ఎగ్జామ్‌ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. ఈ పరీక్షకు మొత్తం 22.79 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించగా, భారత్‌లోని 551 నగరాల్లో 5,440 పరీక్షా కేంద్రాలు, విదేశాల్లోని 14 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు.

పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల ప్రవేశాన్ని కఠిన నిబంధనలతో అమలు చేస్తున్నారు. మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) అన్ని కేంద్రాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. ప్రతి పరీక్షా గదిలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) అందించిన సిగ్నల్ జామర్లను వినియోగిస్తున్నారు.

ప్రతి గదిలో ఇద్దరు ఇన్విజిలేటర్లతో పాటు ప్రతి కేంద్రంలో పది మందికి పైగా సిబ్బందిని నియమించారు. ముఖ గుర్తింపు కోసం 48,448 మంది బయోమెట్రిక్ సిబ్బంది, 38,795 మంది ఫ్రిస్కింగ్ సిబ్బందిని మోహరించారు. అదనంగా 6,700 మంది పరిశీలకులు, 100 మందికి పైగా వర్చువల్ అబ్జర్వర్లు, ప్రతి కేంద్రంలో 40 నుంచి 50 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఈ పునఃపరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారిస్తుండగా, ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది.

ట్యాగ్‌లు
NEETUG2026NEETReExamNEETExamNEETPaperLeakNTACBIDharmendraPradhanCongressChamalaKiranKumarReddyEducationNews
నీట్ రీ-ఎగ్జామ్‌పై ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి - Tholi Paluku