Let's talk: editor@tmv.in
నిరాడంబరంగా త్రిస్సూర్ పూరం.. తరలివచ్చిన భక్తులు

నిరాడంబరంగా త్రిస్సూర్ పూరం.. తరలివచ్చిన భక్తులు

Pinjari Chand
27 ఏప్రిల్, 2026

కేరళలో ప్రసిద్ధిగాంచిన త్రిస్సూర్‌‌ పూరం ఈ ఏడాది విషాద ఛాయల్లో, తక్కువ ఆర్భాటంతో నిర్వహించినా, వేలాది మంది భక్తులను ఆకర్షించింది. ఇటీవల ముండత్తికోడ్‌లో జరిగిన బాణాసంచా పేలుడు ప్రమాదంలో 15 మంది మరణించిన నేపథ్యంలో, వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. అన్ని ఆలయ ఉత్సవాలకు తల్లి”గా పిలువబడే ఈ పూరం, వడక్కునాథన్‌ ఆలయంలో సంప్రదాయ పద్ధతుల్లో జరిగింది. అధికారుల నిర్ణయం మేరకు ఈసారి ప్రధానంగా ఆచారాలకే ప్రాధాన్యం ఇచ్చి, ఉత్సవాల ప్రాధాన్యతను తగ్గించారు. పరమేకావు దేవస్వం, తిరువంబాడి దేవస్వం ఆధ్వర్యంలో అలంకరించిన ఏనుగులు పరస్పరం ఎదురెదురుగా నిలబడి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆకర్షణగా నిలిచింది. అన్ని ఏనుగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రతీ ఏడాది ఆకట్టుకునే ‘కుడమట్టం’ (అలంకరించిన గొడుగుల మార్పిడి కార్యక్రమం) ఈసారి సంక్షిప్తంగా, సుమారు 15 నిమిషాల పాటు ప్రతీకాత్మకంగా నిర్వహించారు. అయితే ప్రసిద్ధ ‘ఇలంజిత్తర మేళం’సంపూర్ణంగా నిర్వహించడంతో ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. సాధారణంగా ఈ పండుగలో ప్రధాన ఆకర్షణగా నిలిచే బాణాసంచా ప్రదర్శనను ఈసారి రద్దు చేసి, కేవలం ప్రతీకాత్మకంగా మాత్రమే కొద్దిగానే టపాకాయలు కాల్చారు. ఈ నిర్ణయం రాష్ట్ర దేవస్వం మంత్రి వీఎన్‌.వాసవన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో, కేరళ హైకోర్టు సూచనల మేరకు తీసుకున్నారు. భద్రత పరంగా విస్తృత చర్యలు తీసుకున్నారు. సుమారు 350 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. అటవీ, పశుసంవర్ధక శాఖలు కూడా ఏనుగుల నిర్వహణపై కఠిన నియమాలు పాటించాయి.

జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో, భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఏప్రిల్ 21న ముండత్తికోడ్‌లో బాణాసంచా తయారీ సమయంలో జరిగిన పేలుళ్లలో 15 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ విషాదం నేపథ్యంలో ఈసారి పూరం ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించారు. అయితే ఆర్భాటం తగ్గినా, శతాబ్దాల సంప్రదాయాన్ని కాపాడుతూ, ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా ఈ ఏడాది త్రిస్సూర్ పూరం ప్రశాంతంగా కొనసాగింది.