Let's talk: editor@tmv.in
ప్రకృతితో కూడిన అభివృద్ధే శాశ్వతం.. 18 నగర వనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ప్రకృతితో కూడిన అభివృద్ధే శాశ్వతం.. 18 నగర వనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Gaddamidi Naveen
2 జులై, 2026

ఏ దేశమైతే ప్రకృతితో కలిసి ఎదుగుతుందో, ఆ దేశం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రకృతితో పాటు సాధించే అభివృద్ధే శాశ్వతంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన వారసత్వం అనేది కేవలం మనం నిర్మించిన కట్టడాలు కాకూడదని, మనం కాపాడిన ప్రకృతి అయి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నగరాలు శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ నగర వనాలు పట్టణాలకు ‘గ్రీన్ లంగ్స్’ (పచ్చని ఊపిరితిత్తులు) లాగా పని చేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘నగర వన యోజన’ నిధులతో పాటు స్థానిక నిధులను సమకూర్చుకుంటూ రూ. 36 కోట్ల భారీ వ్యయంతో వీటిని అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఒక్కో నగర వనాన్ని సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో, రూ. 2 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దారు. కొడూరు, కైలాసగిరి, మదనపల్లెలలో ప్రత్యేకంగా 'ఎర్రచందనం పరిరక్షణ పార్కులను' ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జీవవైవిధ్య పరిరక్షణతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నక్షత్ర వనాలు, రాశి వనాలను కూడా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.

ఇవి ప్రజల శారీరక, మానసిక ఉల్లాసానికి కేంద్రాలుగా నిలవనున్నాయన్నారు. ఈ పార్కుల్లో పక్షుల ఆవాసాలు, బోటింగ్, కయాకింగ్, ట్రెకింగ్ పాయింట్లు, యోగా కేంద్రాలు, ఓపెన్ జిమ్‌లు వంటి ఎన్నో ప్రత్యేక ఆకర్షణలను తీసుకొచ్చామని తెలిపారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న ఆధునిక నగరాల్లో ఈ నగర వనాలు ప్రజలకు ప్రకృతి ప్రశాంతతను అందిస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవి నేటి అవసరాలకే కాకుండా రాబోయే తరాలకు అందించే పచ్చని వారసత్వమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ వీటిని పరిరక్షిస్తూ మరింత పచ్చని, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నగర వనాన్ని స్వయంగా సందర్శించి పరిశీలించినట్లు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన పచ్చదనం, ఆధునిక వసతులు కుటుంబంతో కలిసి సమయం గడపడానికి అనువుగా ఉన్నాయని చెప్పారు. సమీపంలోని గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని నగర వనంతో అనుసంధానించి ట్రెకింగ్ మార్గంగా అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మిక, సాహస పర్యాటకానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, సవిత వర్చువల్‌గా పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
PawanKalyanAndhraPradeshUrbanForestsGreenAndhraEcoParksAPForestEnvironmentSustainableDevelopmentGoGreenNatureConservation
ప్రకృతితో కూడిన అభివృద్ధే శాశ్వతం.. 18 నగర వనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ - Tholi Paluku