Let's talk: editor@tmv.in
నారీ శక్తి వికాసం దేశ పురోగతికి పునాది: పవన్ కళ్యాణ్

నారీ శక్తి వికాసం దేశ పురోగతికి పునాది: పవన్ కళ్యాణ్

Panthagani Anusha
17 ఏప్రిల్, 2026

భారతదేశం నేడు సరికొత్త దిశగా దూసుకుపోతోందని ప్రతి రంగంలోనూ 'నారీ శక్తి' ప్రభవం స్పష్టంగా కనిపిస్తోందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహిళలు సాధిస్తున్న అసాధారణ విజయాలు భారత సమాజంలో వస్తున్న సానుకూల మార్పులకు నిదర్శనమని ఆయన కొనియాడారు. కేవలం వంటింటికే పరిమితం కాకుండా, దేశ గమనాన్ని మార్చే శక్తిగా మహిళలు ఎదిగారని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రస్తుత పరిణామాలపై తన విశ్లేషణను పంచుకున్నారు.

క్రీడా రంగంలో చారిత్రక విజయాలు

ఇటీవల సైప్రస్‌లో జరిగిన ఫైడ్ మహిళల కాండిడేట్స్ టోర్నమెంట్లో భారత చెస్ సంచలనం ఆర్.వైశాలి సాధించిన ఘనతను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌కు సవాలు చేసే హక్కును పొందిన తొలి భారత మహిళగా ఆమె చరిత్ర సృష్టించడం దేశానికే గర్వకారణమన్నారు. కేవలం చెస్ మాత్రమే కాకుండా, ఒలింపిక్స్ వేదికపై పి.వి. సింధు, మీరాబాయి చాను సాధించిన పతకాలు, ప్రపంచ బాక్సింగ్ వేదికపై నిఖత్ జరీన్ చాటిన సత్తా భారత క్రీడారంగానికి వన్నె తెచ్చాయని ఆయన వివరించారు.

పాలన నుంచి అంతరిక్షం వరకు మహిళా ముద్ర

దేశ అత్యున్నత పదవిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాయకత్వం భారత ప్రజాస్వామ్యానికి కొత్త బలాన్ని ఇస్తోందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు అంతరిక్ష పరిశోధనల్లో రీతూ కరిదాల్ వంటి మేధావుల ప్రతిభ దేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రభాగాన నిలుపుతోందని పేర్కొన్నారు. అవకాశం ఇస్తే మహిళలు ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించగలరని ఈ విషయాలు నిరూపిస్తున్నాయని ఆయన అన్నారు.

రాజ్యాంగ నిర్మాతల ఆశయాలే స్ఫూర్తి

మహిళా సాధికారత అనేది భారత రాజ్యాంగ పునాదుల్లోనే ఉందని పవన్ గుర్తు చేశారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన దక్షాయణి వేలాయుధన్, హన్సా మెహతా, దుర్గాబాయి దేశ్‌ముఖ్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమృత్ కౌర్ వంటి మహనీయుల కృషి వల్లనే నేడు మహిళలకు గౌరవం, సమానత్వం, న్యాయం లభిస్తున్నాయని కొనియాడారు. ఆ మహనీయుల ఆశయాలకు అనుగుణంగానే నేడు మహిళా సమాజం ముందుకు సాగుతోందని తెలిపారు.

రిజర్వేషన్లు: హక్కుల పునరుద్ధరణ

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రవేశపెట్టిన ‘నారీ శక్తి వందన్ అధినియమం (సవరణ బిల్లు) 2026’ను పవన్ కళ్యాణ్ చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారిని నిర్ణయాత్మక శక్తిగా మార్చేందుకు పునాది పడిందన్నారు. ఇది మహిళలకు కొత్తగా ఇస్తున్న హక్కు కాదు, వారికి ఎప్పుడో చెందాల్సిన హక్కులను తిరిగి ఇస్తున్న గౌరవమని ఆయన స్పష్టం చేశారు.

సాధికారతకు జనసేన నిబద్ధత

తొలి నుంచి మహిళా పక్షపాతంగా ఉన్న జనసేన పార్టీ, వారి సాధికారతకు నిరంతరం కట్టుబడి ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశాన్ని చేర్చామని ఆ కట్టుబాటు నేటికీ కొనసాగుతోందని గుర్తు చేశారు. "బలమైన మహిళలు బలమైన కుటుంబాలను నిర్మిస్తారు.. బలమైన కుటుంబాలు బలమైన దేశాన్ని నిర్మిస్తాయి" అని ఆయన సందేశం ఇచ్చారు. నారీ శక్తి ఇకపై కేవలం నినాదంగా కాకుండా భారత నాగరికతకు వెన్నుముకగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.