
పార్లమెంట్ తరహాలో తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం అభివృద్ధి
తెలంగాణ శాసనసభ ప్రాంగణాన్ని దేశ రాజధానిలోని పార్లమెంట్ తరహాలో అత్యాధునికంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టాల్సిన సివిల్ పనులపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్లమెంట్‌లో ఉన్నట్లుగానే అసెంబ్లీలో కూడా ఒక సెంట్రల్ హాల్‌ను నిర్మించాలని సీఎం ప్రతిపాదించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని పబ్లిక్ గార్డెన్ పరిధిలో శాసనసభ్యుల కోసం ప్రత్యేకంగా ఒక క్లబ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో వాకింగ్ ట్రాక్, క్రీడా సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతను మరింత కఠినతరం చేయాలని, అదే సమయంలో అక్కడున్న చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు.
అసెంబ్లీ ప్రాంగణంలో నిజాం కాలం నాటి పాత అసెంబ్లీ భవనం ఉంది. ఈ భవనం ప్రస్తుతం శాసన మండలి కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. నిజాం పాలనలో టౌన్ హాల్‌గా నిర్మించబడిన ఈ వారసత్వ భవనం, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో 1980ల మధ్య వరకు అసెంబ్లీగా ఉపయోగించారు. అనంతరం 294 మంది ఎమ్మెల్యేలకు సరిపడే విధంగా కొత్త భవనాన్ని పాత కట్టడం వెనుక నిర్మించారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ 1980లలో నిర్మించిన కొత్త భవనంలోనే కొనసాగుతోంది. ఈ ప్రతిపాదిత అభివృద్ధి పనులతో అసెంబ్లీ ప్రాంగణానికి ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు చారిత్రక ప్రాముఖ్యత కూడా నిలుపుదల అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
