Let's talk: editor@tmv.in
సీఎస్‌ఆర్ నిధులతో ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి.. సంస్థలతో ఒప్పందాలు
సీఎస్‌ఆర్ నిధులతో ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి.. సంస్థలతో ఒప్పందాలు

సీఎస్‌ఆర్ నిధులతో ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి.. సంస్థలతో ఒప్పందాలు

Gaddamidi Naveen
24 మే, 2026

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా రంగ బలోపేతం కోసం ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన రహేజా గ్రూప్, రామ్‌కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద ప్రభుత్వంతో చేతులు కలిపాయి. సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర విద్యాశాఖ సదరు సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పంద పత్రాలను నీల్ రహేజా, అల్లా దాక్షాయణి, గోరుకంటి దేవేందర్ రావు ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ ఒప్పందాల ప్రకారం ఆయా సంస్థలు రూ.92 కోట్లకు పైగా వ్యయంతో క్రింది విద్యా సంస్థలను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా రామ్‌కీ ఫౌండేషన్ మెదక్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్‌మీడియట్ స్థాయి వరకు సమగ్ర విద్యా క్యాంపస్ నిర్మాణానికి మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం వాటాగా రూ.19.66 కోట్లు అందించనుంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల అభివృద్ధికి కూడా రూ.10.4 కోట్లు వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టులో ప్రీ-ప్రైమరీ నుంచి ఐదో తరగతి, ఇంటర్ స్థాయి వరకు మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు.

కే రాహేజా గ్రూప్ రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి రూ.50.50 కోట్లు కేటాయించింది. యశోద ఫౌండేషన్ ఉప్పల్‌లోని సుభాష్‌నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ, 6వ, 7వ తరగతుల మౌలిక వసతుల అభివృద్ధికి రూ.12.20 కోట్లు అందించనుంది.

ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి వసతులతో రూపుదిద్దుకోనున్నాయి. ఈ సదస్సులో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.