Let's talk: editor@tmv.in
అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికే సాధ్యం:

అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికే సాధ్యం:

Panthagani Anusha
15 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కోవూరు పంచాయతీ పరిధిలోని పెళ్లకూరు రామచంద్రారెడ్డి కాలనీలో రూ. 33 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సి.సి. రోడ్లును, డ్రైన్లను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లోనూ పట్టణాలకు మౌలిక సదుపాయాలను కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఆశయమని ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. కోవూరు పంచాయతీ పరిధిలో ఇప్పటికే రూ. 11 కోట్ల 10 లక్షల అంచనా వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని వివరించారు.

రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ అభివృద్ధి ఆగిపోకూడదన్న పట్టుదలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారని కొనియాడారు. సూపర్ సిక్స్ వంటి భారీ సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేవలం మాటలు చెప్పడం కాకుండా, క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.