


అభివృద్ధి–సామాజిక న్యాయమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర రాజధానిలో అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద విచ్చేసి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. దశాబ్దాల ఉద్యమ పోరాటాలు, ఎందరో అమరుల త్యాగాల చరిత్రను స్మరిస్తూ, తెలంగాణను సమున్నతంగా అభివృద్ధి చేసి ప్రపంచానికే గేట్‌వేగా నిలబెట్టాలన్న స్వప్నం కోసం మనమంతా పునరంకితమవుదామని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రధాన వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. భద్రతా దళాల అద్భుత కవాతును తిలకించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రజాప్రభుత్వం నిర్దేశించుకున్న సమగ్ర, సమ్మిళిత వృద్ధి లక్ష్యాల సాధనలో ప్రజల అండదండలు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు.
కాళోజీ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల ఉద్యమ ఫలితమని, వేలాది మంది పోరాటయోధులు, అమరవీరుల త్యాగాలతో సాధ్యమైనదని పేర్కొన్నారు. డిసెంబర్ 7, 2023న బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తెలంగాణ అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం లక్ష్యాల సాధనకే ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు చెప్పిన “పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది” అనే మాటలను ఉటంకిస్తూ ప్రజాసేవే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు నెరవేరుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల సామాజిక న్యాయం కోసం గడిచిన రెండున్నరేళ్లుగా అనేక అద్భుత సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో నలుగురు వ్యక్తుల ఆలోచనలే రాష్ట్ర భవిష్యత్ అన్నట్టుగా స్పష్టత లేని పరిస్థితి ఉండేదని, తాము అధికారంలోకి వచ్చాక మేధావుల మధనంతో రాష్ట్రం మొత్తానికి ఒకే మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేశామని సీఎం వివరించారు. ‘తెలంగాణ రైజింగ్ - 2047’ దార్శనికతతో రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ గా వర్గీకరించి మూడంచెల అభివృద్ధి వ్యూహాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలన్నది ప్రజా ప్రభుత్వ దృఢ సంకల్పమని ప్రకటించారు.
వ్యవసాయ విప్లవం.. రైతు సంక్షేమం
రాష్ట్రానికి అత్యంత కీలక ఆధారమైన వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. రైతులు అప్పుల్లేని కార్యసాధకులు కావాలన్న సంకల్పంతో ఒకేసారి రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని తెలిపారు. గడిచిన రెండున్నరేళ్లలో వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి ఏకంగా రూ. 1,56,496 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. దళారుల బారిన పడి రైతులు మోసపోకూడదని, ఎంత భారమైనా సరే పండించిన పంటను కనీస మద్దతు ధరతో చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు తిరిగి జీవం పోసి సాగునీటి అవసరాలను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మహిళా సాధికారతకు పెద్దపీట
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో చేపట్టిన కార్యక్రమాల వల్ల మహిళా సంఘాలు ఆర్థిక శక్తి కేంద్రాలుగా, పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దే క్షేత్రాలుగా మారుతున్నాయన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయం, మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఇప్పటివరకు దాదాపు రూ. 10,000 కోట్లు ఆదా చేసుకోగలిగారని, ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిన పథకమని సీఎం చెప్పారు. అలాగే 42.90 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, 53.09 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.
యువతకు ఇచ్చిన హామీ మేరకు పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్కరణలతో రికార్డు స్థాయిలో 67,763 ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం వెల్లడించారు. భవిష్యత్తులో కూడా నోటిఫికేషన్ల జారీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 1,362 స్కూళ్లలో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రవేశపెట్టగా, ఈ ఏడాది కొత్తగా మరో 2,769 స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేస్తూ, మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్ల ఉద్యోగ, జీవిత భద్రత కోసం ప్రత్యేక చట్టం తెచ్చామని, ఇందులో చొరవ చూపిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సీఎం అభినందనలు తెలిపారు.
ఆహార, వసతి భద్రత
మొదటి ఏడాదే రూ. 22,500 కోట్లు కేటాయించి 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, గత 13 నెలల కాలంలోనే లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. సెప్టెంబర్ 17 నాటికి మిగతా 2 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసి, పాత కార్డుల్లో 19.44 లక్షల కొత్త సభ్యులను చేర్చామని, తద్వారా 3 కోట్ల 38 వేల మంది ప్రజలకు సన్న బియ్యం భోజనం అందుతోందని వివరించారు.
తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తగిన న్యాయం చేసేందుకు కె. కేశవరావు, కోదండరాం నాయకత్వంలో అధికారిక కమిటీని నియమించామని, వారి నివేదిక ఆధారంగా యోధులను సముచితంగా సత్కరిస్తామని చెప్పారు. అలాగే పదేళ్లుగా నిలిచిపోయిన సినిమా అవార్డులను తిరిగి ప్రారంభించి, ప్రజా గాయకుడు గద్దరన్న పేరుతో వీటిని ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన సర్వేను విజయవంతంగా పూర్తి చేశామని, ఇది దేశవ్యాప్త జనగణనకు రోల్ మోడల్‌గా నిలిచిందని సీఎం ప్రకటించారు.
ఉద్యోగుల సంక్షేమం, గ్రేటర్ హైదరాబాద్ ప్రణాళికలు
ప్రభుత్వ ఉద్యోగులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని సీఎం చెప్పారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఉద్యోగులకు కోటి రూపాయలతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని, ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా నగదు రహిత ఆరోగ్య పథకం అమలు చేయబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు.
ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని ‘క్యూర్’ కింద ప్రపంచ స్థాయి సర్వీసెస్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. కాలుష్య పరిశ్రమలను బయటకు తరలించేందుకు ‘హిల్ట్’ పాలసీ తెచ్చామని, ఈవీ వాహనాలకు లైఫ్ టాక్స్, రిజిస్ట్రేషన్, రోడ్డు టాక్స్‌ల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. నగరంలో కబ్జాలకు గురైన చెరువులను కాపాడటానికి హైడ్రాను ఏర్పాటు చేసి, ఇప్పటివరకు రూ. 60 వేల కోట్ల విలువైన 1,045 ఎకరాలకు పైగా భూములను ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకుని ప్రజల ఆస్తిగా మార్చామన్నారు.
ఆస్తులను అమ్ముకునే పద్ధతికి స్వస్తి చెప్పి, ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ నుంచి కొనుగోలు చేసి పూర్తిగా ప్రజల ఆస్తిగా మార్చామన్నారు. ఫేజ్-2 కింద 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించేందుకు రూపొందించిన డీపీఆర్ ను కేంద్రానికి సమర్పించినట్లు తెలిపారు. పర్యావరణహిత నగరం కోసం మూసీ ప్రక్షాళన చేపడుతున్నామని, అలాగే 30 వేల ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ని గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. శంషాబాద్‌ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేసి రీజనల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తామన్నారు. చివరగా, ప్రజలందరి సహకారం, ఆశీర్వాదాలతో ఈ అద్భుత ప్రగతి లక్ష్యాలను ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా చేరుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
