
లైన్‌మెన్ కుటుంబానికి రూ.కోటి బీమా సాయం అందజేసిన డిప్యూటీ సీఎం
విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఎన్పీడీసీఎల్ లైన్‌మెన్ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ కుటుంబానికి భారీ ఆర్థిక భరోసా లభించింది. ఆయన సతీమణి (నామినీ) సోన్కాంబ్లే స్వప్నకు రూ. 1 కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం ప్రజాభవన్‌లో అందజేశారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్‌కు ఉన్న అవగాహన ఒప్పందం ప్రకారం.. యూఎస్ఎస్ఏ-2/ యూఎస్ఎస్ఏ-3 పథకాల కింద శాలరీ ఖాతాలు కలిగిన ఉద్యోగులకు రూ. 1 కోటి వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే బాసర పరిధిలో లైన్‌మన్‌గా పనిచేస్తున్న ప్రమోద్ కుమార్, 2024 సెప్టెంబర్ 23న తన శాలరీ ఖాతాను ప్రారంభించారు. అయితే, దురదృష్టవశాత్తు ఆయన 2025 మార్చి 24న విధి నిర్వహణలో జరిగిన ప్రమాదంలో మరణించారు.
ఆయన అకాల మరణం తర్వాత, భార్య స్వప్న సమర్పించిన క్లెయిమ్ దరఖాస్తును బ్యాంక్ వేగంగా పరిష్కరించింది. ఈ బీమా మొత్తం రూ. 1 కోటి మే 30,2026 రోజున ఆమె సేవింగ్స్ ఖాతాలో జమ అయింది. ఈ క్లెయిమ్ వేగంగా పరిష్కారం కావడం ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వానికి, బ్యాంకింగ్ రంగానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి, యూనియన్ బ్యాంక్ సీఈవో అశిష్ పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమరేష్ ప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొని బాధిత కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.
