Let's talk: editor@tmv.in
మన్యం జిల్లా పెదపెంకి గ్రామ అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స‌మీక్ష‌

మన్యం జిల్లా పెదపెంకి గ్రామ అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స‌మీక్ష‌

Gaddamidi Naveen
7 జూన్, 2026

పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామాన్ని సుదీర్ఘకాలంగా పీడిస్తున్న భయానక ఫైలేరియా (బోద వ్యాధి) సమస్యకు కూటమి ప్రభుత్వం సమష్టి కృషితో శాశ్వత పరిష్కారం చూపిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక చిన్న గ్రామంలో నెలకొన్న సామాజిక అంతరాల వల్ల యావత్ గ్రామమంతా వ్యాధి బారినపడిన వైనం 2018లోనే తన దృష్టికి వచ్చిందని, అప్పట్లోనే దీనిపై మాట్లాడానని ఆయన గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో శాశ్వత పరిష్కార మార్గాలు లభించాయన్నారు.

పెదపెంకి గ్రామంలో నమోదైన ఫైలేరియా కేసులు, అక్కడ సాగుతున్న సమగ్ర అభివృద్ధి పనులపై శనివారం జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో విభిన్న వర్గాల మధ్య ఉన్న సామాజిక అంతరాల వల్ల వాడుకునే మురుగునీటిని కూడా బయటకు పంపలేని విభేదాలు ఉండేవని, ఫలితంగా మురుగునీరంతా ఒకే చోట నిలిచిపోయి క్యూలెక్స్ దోమలు విపరీతంగా పెరిగిపోయాయని వివరించారు. ఒకే ఊరిలో ఏకంగా 197 ఫైలేరియా కేసులు నమోదై ఈ సమస్య జాతీయస్థాయికి వెళ్ళిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పదేళ్లలో 12 శాతం తగ్గిన జనాభా

ఈ గ్రామంలో ఒకప్పుడు 7,900 జనాభా ఉండేదని, అయితే వ్యాధి తీవ్రత పెరగడం, భయాందోళనల వల్ల చాలామంది వలస వెళ్ళిపోవడంతో గత పదేళ్లలో ఇక్కడి జనాభా 12 శాతం తగ్గిపోయిందని పవన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే ఏజెన్సీ గ్రామమైన పెదపెంకిపై ప్రత్యేక ఫోకస్ పెట్టి, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో డ్రైన్ల ఆక్రమణలను తొలగించామన్నారు. ఉపాధి హామీ నిధులు రూ. 6.18 కోట్లతో గ్రామంలో మ్యాజిక్ డ్రెయిన్లు, సీసీ రోడ్లు నిర్మించడం ద్వారా మురుగునీరు నిల్వ ఉండకుండా పారుదల సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. దీనివల్ల దోమల లార్వాల తీవ్రతతో పాటు కేసుల తీవ్రత కూడా తగ్గిందన్నారు.

త్వరలోనే గ్రామ పర్యటన

జిల్లా యంత్రాంగం గ్రామాన్ని జల్లెడ పట్టినప్పుడు క్యూలెక్స్, ఎనాఫిలిస్ వంటి ప్రమాదకర దోమల లార్వాలు మురుగునీటిలో భారీగా పేరుకుపోయినట్లు గుర్తించారని డిప్యూటీ సీఎం తెలిపారు. దీనివల్ల ఫైలేరియాతో పాటు చికెన్‌గున్యా, డెంగీ వంటి వ్యాధులు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రస్తుతం గ్రామంలో 20 మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం ద్వారా స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడిందని, మొదట అభివృద్ధిని వ్యతిరేకించిన గ్రామస్థులే ఇప్పుడు ప్రభుత్వాన్ని, అధికారులను మెచ్చుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డికి, జిల్లా యంత్రాంగానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, త్వరలోనే తాను స్వయంగా పెదపెంకి గ్రామాన్ని సందర్శిస్తానని పవన్ క‌ళ్యాణ్ ప్రకటించారు.