

మంగళగిరిలో ‘అరణ్యారామం’ భవనానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ భవనం ‘అరణ్యారామం’ నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రి సమీపంలో, బ్రహ్మానందపురం వద్ద సుమారు రూ. 24 కోట్ల అంచనా వ్యయంతో ఈ అత్యాధునిక భవనాన్ని నిర్మించనున్నారు.
శుక్రవారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పవన్ కళ్యాణ్ నూతన భవన ప్రాంగణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ నూతన భవనం అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించిన పరిశోధనలు, శిక్షణలతో పాటు ప్రకృతి సంరక్షణ కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదిక పైకి తెచ్చే ‘కామన్ ఫెసిలిటీ సెంటర్’గా సేవలు అందించనుందని పేర్కొన్నారు.
మానవ-వన్యప్రాణి (హెచ్.ఏ.ఎన్.యూ.ఎం.ఏ.ఎన్.) సంఘర్షణల నివారణ కార్యకలాపాలకు ఇది ప్రధాన కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమ పర్యవేక్షణ ఇక్కడి నుంచే సాగుతుంది. పులుల సంరక్షణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ, జీవావరణ పునరుద్ధరణ, వాతావరణ స్థిరత్వం, ఎకో-టూరిజం అభివృద్ధి, డిజిటల్ పర్యావరణ పరిపాలన వంటి విభాగాలకు ఇది సమన్వయ కేంద్రంగా నిలుస్తుంది.
శంకుస్థాపన అనంతరం, పవన్ కళ్యాణ్ భవన నమూనాను పరిశీలించారు. ‘హెచ్.ఏ.ఎన్.యూ.ఎం.ఏ.ఎన్.’ ఫౌండేషన్ ద్వారా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ల ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా, కేవలం 2024 సంవత్సరంలోనే ఏపీ అటవీశాఖ 185 వన్యప్రాణి రక్షణ చర్యలు, 36 మానవ-వన్యప్రాణి సంఘర్షణ నివారణ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిందని అధికారులు వెల్లడించగా, సిబ్బంది నిబద్ధతను డిప్యూటీ సీఎం అభినందించారు.
ధ్వంసమైన మైనింగ్ ప్రాంతంలో ‘నందనవనం’
భూమి పూజ అనంతరం పవన్ కళ్యాణ్ పర్యావరణ పునరుద్ధరణ దిశగా మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2013 నుంచి సాగిన విచ్చలవిడి మైనింగ్ కార్యకలాపాల వల్ల తీవ్రంగా క్షీణించిన కొండ, అటవీ ప్రాంతాన్ని తిరిగి జీవింపజేసేందుకు ‘నందనవనం’ ప్రాజెక్టును ప్రారంభించారు.
అక్కడ స్వయంగా దేశవాళీ మర్రి మొక్కను నాటి ప్రకృతి పునరుజ్జీవనానికి ఊపిరి పోశారు. అక్రమ మైనింగ్‌తో పర్యావరణ విధ్వంసం జరిగిన ఈ ప్రాంతాన్ని దట్టమైన చెట్లతో నింపి నందనవనంగా మార్చడమే తమ సంకల్పమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించి, భావితరాలకు స్వచ్ఛమైన గాలి, సహజ వనరులతో కూడిన వాతావరణాన్ని అందించడమే ఈ ‘నందనవనం’ కాన్సెప్ట్ యొక్క ముఖ్య లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అటవీ పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుళ్ జిందాల్, ఇతర అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
