
స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో "స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0" అమలు పురోగతిపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి సమీక్షా సమావేశం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు.
ఈ రెండు రోజుల సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం మెరుగుపరచడం, ఘన వ్యర్థాల నిర్వహణ, శాస్త్రీయ పద్ధతిలో ఇంటింటి చెత్త సేకరణ–ప్రాసెసింగ్ వంటి కీలక అంశాలపై కేంద్రం సమగ్ర సమీక్ష నిర్వహించనుంది. వీటితో పాటు నగరాల్లో పేరుకుపోయిన పాత చెత్త కుప్పల తొలగింపు, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానాలు, కొత్త ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల అమలుపై చర్చించనున్నారు. ఈ వేదిక ద్వారా వివిధ రాష్ట్రాలు, నగరాలు సాధించిన విజయాలు, వారి ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోనున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ చర్యలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న 4-వే సోర్స్ సెగ్రిగేషన్, ఇంటింటి చెత్త సేకరణ వ్యవస్థ, ఎలక్ట్రిక్ స్వచ్ఛ ఆటో టిప్పర్ల వినియోగం, వికేంద్రీకృత వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు, పాత డంప్‌యార్డుల బయోమైనింగ్, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల తొలగింపు వంటి కార్యక్రమాలను సమావేశంలో ప్రస్తావించనున్నారు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రాలు, ఈ-వేస్ట్ సేకరణ వ్యవస్థ, కిటాక్యుషు మోడల్ ఆధారంగా ఎకో టౌన్ ఏర్పాటు వంటి వినూత్న కార్యక్రమాలను కూడా ఇతర రాష్ట్రాలకు పరిచయం చేయనున్నారు.
తెలంగాణ విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని స్వచ్ఛమైన, పర్యావరణహితమైన, సుస్థిర పట్టణాభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ఉప ముఖ్యమంత్రి వివరించనున్నారు. సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి తోఖన్ సాహు, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ కటికితల, రూపా మిశ్రాతో పాటు పలు రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
