
జనసేన సభకు అనుమతి నిరాకరణ రాజకీయ ప్రేరేపితం: బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి
హైదరాబాద్‌లో జనసేన పార్టీ ప్రతిపాదించిన బహిరంగ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజల భాగస్వామ్యం అన్నా, ప్రజాసమస్యలపై చర్చ అన్నా భయం పట్టుకుందని, ఈ నిర్ణయం వారి చేతగాని పాలనకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
మీడియాతో ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. జనసేన పార్టీ కనీసం 2,000 మందితో సభ పెట్టుకుంటామన్నా కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇవ్వకపోవడం అత్యంత దురదృష్టకరం. బహిరంగ సభలను ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. కేవలం రెండు వేల మందికి రక్షణ కల్పించలేకపోవడం, కనీస శాంతిభద్రతలను కాపాడలేకపోవడం తెలంగాణ ప్రభుత్వ అసమర్థతను చూపిస్తోందని విమర్శించారు. కేవలం పరిపాలనాపరమైన కారణాలను సాకుగా చూపిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ అనుమతిని నిరాకరించారని, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం చేకూరదని ఆయన స్పష్టం చేశారు. పైగా, సభ నిర్వహించడం కంటే ఈ ఆంక్షల వల్లే జనసేన పార్టీకి ఎక్కువ ప్రచారం లభించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో పెరుగుతున్న రాజకీయ ఉత్సాహం
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో తెలంగాణలో జరిగే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ప్రకటించిన నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై తన విమర్శలను తీవ్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరును కపటత్వంగా అభివర్ణించిన ఆయన, ప్రాంతీయ, జాతీయ అంశాలపై ఆ పార్టీ వైఖరిని ప్రశ్నించారు. అంతేకాకుండా, కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే జనసేన సభకు అనుమతి నిరాకరించడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
