
మహిళల కోటా 2029 నుంచే అమలైతే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది: ప్రధాని
శాసనసభల్లో, లోక్‌సభలో మహిళలకు రిజర్వేషన్ 2029 ఎన్నికల నుంచే పూర్తిగా అమల్లోకి వస్తే భారత ప్రజాస్వామ్యం మరింత బలంగా, చైతన్యవంతంగా మారుతుందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. దేశ మహిళలకు రాసిన ఓ బహిరంగ లేఖలో మోడీ మాట్లాడుతూ, మహిళలు విధాన నిర్ణయాలు, పాలనలో చురుకుగా పాల్గొంటే ‘వికసిత భారత్’ లక్ష్యం ఊపందుకుంటుందని తెలిపారు. దేశ అభివృద్ధిని మరింత వేగంగా చేయాలంటే మహిళల చురుకైన భాగస్వామ్యం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై దృష్టి
ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ, ఈ ఆలోచనలతోనే 2023లో ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ను పార్లమెంట్ ఆమోదించిందన్నారు. ఈ చట్టం ద్వారా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడో వంతు (33 శాతం) సీట్లను రిజర్వు చేసే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ చట్టంలో అవసరమైన సవరణలను ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని ఆయన కోరారు. ఇక ఆలస్యం అయితే అది దేశ మహిళల పట్ల అన్యాయం అవుతుందని పేర్కొన్నారు.
2029 ఎన్నికల నుంచి అమలు లక్ష్యం
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం మహిళా రిజర్వేషన్ అమలు 2027 జనగణన తర్వాత జరిగే డిలిమిటేషన్ ప్రక్రియకు అనుసంధానమై ఉండటంతో 2034కు ముందుగా అమలు సాధ్యంకాదు. అయితే 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే అమలు చేయాలంటే చట్టంలో సవరణలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సవరణలు ఆమోదం పొందితే లోక్‌సభ సభ్యుల సంఖ్యను 816కు పెంచి, అందులో 273 సీట్లను మహిళలకు కేటాయించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మహిళల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం బలోపేతం
మహిళల స్వరం శాసనసభల్లో బలపడితే ప్రజాస్వామ్య స్వరం కూడా బలపడుతుందని లేఖలో పేర్కొన్నారు. దేశ మహిళలు ఎన్నో రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్నారని ఆయన అభినందించారు. స్టార్టప్స్, విజ్ఞానం, ఆవిష్కరణలు, విద్య, సాహిత్యం, కళలు, సంగీతం, సినిమా వంటి అనేక రంగాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రత్యేకంగా క్రీడల రంగంలో భారత మహిళలు సాధిస్తున్న విజయాలు కొత్త తరం యువతులకు ప్రేరణగా మారుతున్నాయని పేర్కొన్నారు. పతకాలు గెలుస్తూ, రికార్డులు బద్దలు కొడుతూ మహిళా క్రీడాకారులు దేశ గౌరవాన్ని పెంచుతున్నారని అన్నారు.
ఎంపీలను ప్రోత్సహించండి
రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ చారిత్రక సవరణలు ఆమోదం పొందేందుకు మహిళలు తమ ప్రాంత ఎంపీలకు లేఖలు రాసి మద్దతు ఇవ్వాలని మోడీ కోరారు. ఈ నిర్ణయం శతాబ్దాల పాటు ప్రభావం చూపే చారిత్రక చర్య అవుతుందని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే భారతదేశంలో మహిళలకు సమాన ఓటు హక్కు లభించిందని గుర్తు చేశారు. మూడు, నాలుగు దశాబ్దాలుగా మహిళల రాజకీయ ప్రతినిధిత్వాన్ని పెంచేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని, కానీ అవి పూర్తి స్థాయిలో ఫలించలేదని పేర్కొన్నారు.
2047 లక్ష్యానికి మహిళల భాగస్వామ్యం కీలకం
2047లో స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తయ్యే సమయానికి భారత్‌ను వికసిత దేశంగా తీర్చిదిద్దాలంటే మహిళల ఆశయాలకు న్యాయం చేయడం అత్యంత అవసరమని మోడీ అన్నారు. దేశ జనాభాలో సగానికి సమానమైన మహిళల శక్తి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
