
ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి డిమాండ్.. నిరుద్యోగుల నిరసన
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిరుద్యోగ యువత నిరసన వ్యక్తం చేసింది. తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీల అమలులో జాప్యం జరుగుతోందని వారు ఆరోపించారు.
నిరసనకారులు మాట్లాడుతూ, చిన్నచిన్న నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేయకుండా, ఎన్నికల్లో ప్రకటించిన రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఖాళీ పోస్టుల వివరాలను బహిర్గతం చేసి, స్పష్టమైన నియామక ప్రణాళికను ప్రకటించాలని కోరారు. ఉద్యోగ నియామకాలలో పారదర్శకత అవసరమని, నిరుద్యోగ యువతకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేకంగా పోలీస్ శాఖలో ఉన్న ఖాళీల భర్తీపై దృష్టి సారించాలని, అలాగే పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు వయోపరిమితిని పెంచాలని కోరారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లను విడివిడిగా కాకుండా సమగ్రంగా విడుదల చేసి 10 వేలకుపైగా పోస్టులతో భారీ నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తక్షణమే నియామక క్యాలెండర్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి వేదిక నాయకులు హెచ్చరించారు. యువత సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కోట్ల అఖిల్ సాగర్, సోమయ్య, దేవీసింగ్ రాథోడ్, విజయ్, వీరాంజనేయులు, నవీన్, కళ్యాణ్, కపిల్ తదితరులు పాల్గొన్నారు.
