Let's talk: editor@tmv.in
డీలిమిటేషన్‌‌తో దక్షిణాదికి అన్యాయం జరగదు: ఎన్. రామచందర్ రావు
డీలిమిటేషన్‌‌తో దక్షిణాదికి అన్యాయం జరగదు: ఎన్. రామచందర్ రావు

డీలిమిటేషన్‌‌తో దక్షిణాదికి అన్యాయం జరగదు: ఎన్. రామచందర్ రావు

Gaddamidi Naveen
16 ఏప్రిల్, 2026

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా ఖండించింది. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందన్న సీఎం ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తోసిపుచ్చారు. రేవంత్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

బుధవారం హైదరాబాద్‌లో బీజేపీ మహిళా మోర్చా, యువ మోర్చా ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా నిర్వహించిన స్కూటర్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన రామచందర్ రావు, కాంగ్రెస్ పార్టీ గతంలో మతం, కులం ప్రాతిపదికన ప్రజలను విడదీసిందని, ఇప్పుడు ప్రాంతాల వారీగా విభజన రేఖలు గీసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దేశంలోని అన్ని ప్రాంతాలను బీజేపీ సమానంగా చూస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఏ ప్రాంతానికి అన్యాయం జరగనివ్వబోమని ప్రధాని మోడీ ఇదివరకే హామీ ఇచ్చారని, దక్షిణాది రాష్ట్రాల హక్కులను కేంద్రం కాపాడుతుందని ఆయన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ వ్యాప్తి చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

గతంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ బిల్లు ఆగిపోయిందని, నాడు కాంగ్రెస్ మిత్రపక్షాలైన ములాయం సింగ్ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్‌లే దీనిని అడ్డుకున్నారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ కృషితోనే 2023లో ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందని తెలిపారు.

లక్ష్మణ్ ఆగ్రహం: 'హైబ్రిడ్ మోడల్' రాజ్యాంగ విరుద్ధం!

బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ కూడా రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్'పై నిప్పులు చెరిగారు. జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రాల ఆర్థిక సహకారం (జీఎస్డీపీ) ఆధారంగా సీట్లు కేటాయించాలనడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 50:50 ఫార్ములా (జనాభా, జీఎస్‌డీపీ) కాంగ్రెస్ పార్టీ అధికారిక నిర్ణయమా? దీనిపై మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించేటప్పుడు రేవంత్ రెడ్డి ఏ నిబంధనలు పాటించారని ప్రశ్నించారు. అప్పుడు అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించలేదని, అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని నిలదీశారు. కేవలం ఎంఐఎం ప్రయోజనాల కోసమే జీహెచ్‌ఎంసీని విభజించారని ఆయ‌న ఆరోపించారు.

మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తూ, జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది గొంతు పార్లమెంటులో నొక్కేయబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా 'హైబ్రిడ్ మోడల్'ను ఆయన ప్రతిపాదించారు. అలాగే ఈ అంశంపై చర్చించేందుకు అన్ని పార్టీల సమావేశాన్ని నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తమిళనాడు (ఎం.కె. స్టాలిన్), ఆంధ్రప్రదేశ్ (చంద్రబాబు నాయుడు), కర్ణాటక (సిద్ధరామయ్య), కేరళ (పినరయి విజయన్) పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు లేఖలలో దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని రేవంత్ రెడ్డి కోరారు. మేము పన్నులు చెల్లిస్తూ, ఢిల్లీలో సలాం కొట్టే పరిస్థితి రాకూడదు అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, నియోజకవర్గాల పునర్విభజన అనేది ఎప్పుడూ జనాభా ప్రాతిపదికనే జరుగుతుందని, దీనిని వివాదాస్పదం చేయడం సరికాదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, పునర్విభజన బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో, తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది.