Let's talk: editor@tmv.in
కోర్టు వీడియోలను తొలగించండి ..కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసు

కోర్టు వీడియోలను తొలగించండి ..కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసు

Pinjari Chand
24 ఏప్రిల్, 2026

కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో షేర్‌‌ చేసిన వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్​) నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్‌తో పాటు మనీశ్‌ సిసోడియా, సంజయ్ సింగ్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ వి. కామేశ్వర్ రావు, జస్టిస్ మన్మీత్ పి.ఎస్. అరోరా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేస్తూ, ఏప్రిల్ 13న జరిగిన విచారణకు సంబంధించిన వీడియోలను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించింది. కోర్టు విచారణలను అనుమతి లేకుండా రికార్డు చేయడం, ప్రచారం చేయడం హైకోర్టు నియమావళి ప్రకారం నిషేధమని స్పష్టం చేసింది. పిటిషనర్ అడ్వకేట్ వైభవ్ సింగ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)లో, కేజ్రీవాల్ పిటిషన్ విచారణ సమయంలో తీసిన వీడియోలను ఉద్దేశపూర్వకంగా రికార్డు చేసి, ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు. కోర్టు ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ చర్యలు జరిగాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సంబంధిత వీడియోలను వెంటనే తొలగించాలని, బాధ్యులపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని పిటిషన్‌లో కోరారు. అలాగే ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. విచారణ సందర్భంగా మెటా, గూగుల్ సంస్థల తరఫు న్యాయవాదులు ఇప్పటికే పిటిషనర్ సూచించిన వీడియో లింకులను తొలగించినట్లు కోర్టుకు తెలిపారు. ఎక్స్ లో ఇంకా వీడియోలు ఉంటే, నోటీసు అందిన వెంటనే వాటిని కూడా తొలగించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ప్రతిష్ట పరిరక్షణ చాలా ముఖ్యమైనది. ఇటువంటి చర్యలను నియంత్రించకపోతే సమస్య మరింత పెరుగుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కంటెంట్‌ను పర్యవేక్షించే సామర్థ్యం లేదు

సోషల్ మీడియా సంస్థలు స్పందిస్తూ, తమకు ముందస్తుగా కంటెంట్‌ను పర్యవేక్షించే సామర్థ్యం లేదని, కానీ సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి. వీడియోలను తొలుత ఎవరు అప్‌లోడ్ చేశారో గుర్తించగలమని, అవసరమైతే ఆ వివరాలను అందిస్తామని తెలిపాయి. ఇదే కేసులో ఆప్ నేతలు సంజీవ్ ఝా, ముఖేష్ అహ్లావత్, జర్నైల్ సింగ్, జర్నలిస్ట్ రవీష్ కుమార్‌లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖను కూడా ఈ కేసులో పక్షంగా చేర్చి, వారి స్పందన కోరింది. ఈ కేసును జూలై 6న తదుపరి విచారణకు తీసుకుంటామని కోర్టు తెలిపింది. ఇక ఈ వ్యవహారం నేపథ్యంగా, లిక్కర్ పాలసీ కేసులో జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తనను తప్పించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను తిరస్కరించిన విషయం తెలిసిందే. సరైన ఆధారాలు లేకుండా న్యాయమూర్తిని మార్చాలని కోరడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.