
తిరుమల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన ఢిల్లీ సీఎం
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బుధవారం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సందర్శన అనంతరం ఆమె వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక 'ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్'ను సందర్శించి అక్కడి నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
ముందుగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఆలయ మర్యాదల నడుమ స్వామివారి దర్శనం ముగించుకున్న ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అత్యాధునిక సాంకేతికతతో భక్తుల పర్యవేక్షణ
కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శనలో భాగంగా టీటీడీ అదనపు కార్యనిర్వాహక అధికారి (అడిషనల్ ఈవో) సి.హెచ్. వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి సెంటర్ పనితీరును వివరించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి వారి భద్రతను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్న 'ప్రెడిక్టివ్ అనలిటిక్స్' వ్యవస్థ గురించి ప్రత్యేకంగా వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో భక్తుల కదలికలను ముందే అంచనా వేసి క్యూ లైన్లలో ఇబ్బందులు కలగకుండా తీసుకుంటున్న చర్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు.
బహుళ విభాగాల సమన్వయం
సెంటర్ ద్వారా లడ్డూ ప్రసాదం తయారీ విభాగం, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, వసతి గదుల కేటాయింపు వంటి కీలక అంశాలను ఎలా సమన్వయం చేస్తారో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కొండపై ఎక్కడ చిన్న సమస్య తలెత్తినా వెంటనే ఈ కమాండ్ సెంటర్ ద్వారా సంబంధిత విభాగాలను అప్రమత్తం చేసే విధానం పట్ల అదేవిదంగా భక్తులు భద్రత విషయంలో టీటీడీ అనుసరిస్తున్న అత్యున్నత ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పట్ల ఆమె ప్రశంసలు కురిపించారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న హిందూ దేవాలయ సంస్థగా వెలుగొందుతున్న టీటీడీ, భక్తుల సౌకర్యార్థం అమలు చేస్తున్న వినూత్న పద్ధతులు అభినందనీయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ పర్యటనలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
