
ఈ నెల 13న దుండిగల్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
హైదరాబాద్ సమీపంలోని దుండిగల్‌లో గల ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ) లో జూన్ 13న జరగబోయే 217వ కోర్సు ‘కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్’ (సీజీపీ) కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై, పరేడ్‌ను సమీక్షించనున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) కు చెందిన వివిధ విభాగాల ఫ్లైట్ క్యాడెట్ల ప్రీ-కమిషనింగ్ శిక్షణ విజయవంతంగా పూర్తి కావడానికి ప్రతీకగా ఈ ఉత్సవం జరగనుంది.
ఈ వేడుకలో రివ్యూయింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్న రాజ్‌నాథ్ సింగ్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ట్రైనీలకు ‘ప్రెసిడెంట్స్ కమిషన్’ను ప్రదానం చేస్తారని బుధవారం ఒక రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఐఏఎఫ్ ఫ్లైట్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, వియత్నాం దేశానికి చెందిన ఆఫీసర్లు, ట్రైనీలకు శిక్షణ పూర్తి చేసుకున్నందుకు గానూ వింగ్స్, 'బ్రెవెట్స్' అందజేస్తారు.
ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఒక అద్భుతమైన చారిత్రాత్మక మైలురాయికి వేదిక కానుంది. పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) నుంచి మే 30, 2025న విజయవంతంగా పాస్ అవుట్ అయి, ఆయా విభాగాల ప్రత్యేక శిక్షణ కోసం ఎయిర్ ఫోర్స్ అకాడమీలో చేరిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ వేడుక ద్వారా అధికారికంగా విధుల్లోకి చేరబోతున్నారు. అలాగే ఫ్లయింగ్, నావిగేషన్ స్ట్రీమ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచి మెరిట్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ఫ్లైట్ క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ ప్రెసిడెంట్స్ ప్లాక్ ను బహుకరిస్తారు.
ఆకాశంలో అద్భుత విన్యాసాలు
ఈ కార్యక్రమం ఆకాశ్ గంగ ‘ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్’ ల అద్భుత ప్రదర్శనలతో ప్రారంభం కానుంది. ఎయిర్ స్టాఫ్ చీఫ్ (సీఏఎస్) ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్ నేతృత్వంలో జరిగే ఫ్లై-పాస్ట్‌లు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఫ్లై-పాస్ట్‌లో భాగంగా నాలుగు రకాల శిక్షణ విమానాలు పిలాటస్ పిసి-7 ఎమ్కెఎల్ ఐ, హాక్, కిరణ్, చేతక్ విమానాలు తమ ప్రదర్శనను చాటనున్నాయి. వీటితో పాటు సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు, సారంగ్ హెలికాప్టర్ డిస్‌ప్లే టీమ్, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ లు ఆకాశంలో చేయబోయే విన్యాసాలు ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
