


జర్మనీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఘన స్వాగతం
భారత్, జర్మనీ దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే లక్ష్యంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల అధికారిక పర్యటన మంగళవారం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాలు కలిసి పనిచేయడం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. పర్యటనలో భాగంగా మ్యూనిచ్ చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్‌కు జర్మనీ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది.
గగనతలంలో యుద్ధ విమానాల కాన్వాయ్..
మ్యూనిచ్ నుండి రాజధాని బెర్లిన్ వెళ్లే సమయంలో రాజ్‌నాథ్ సింగ్‌కు జర్మనీ ప్రభుత్వం ఎంతో గౌరవం ఇచ్చింది. ఆయన ప్రయాణం కోసం జర్మనీ వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానాన్ని కేటాయించడమే కాకుండా, ఆ విమానానికి తోడుగా ఇరువైపులా యుద్ధ విమానాలు రక్షణగా రావడం విశేషం. రాజ్‌నాథ్ సింగ్ బెర్లిన్ చేరుకోగానే జర్మనీ సైన్యం ఆయనకు గౌరవ వందనం సమర్పించి ఘనంగా స్వాగతం పలికింది.
కీలక ఒప్పందాలు
బుధవారం జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్‌తో రాజ్‌నాథ్ సింగ్ జరపబోయే చర్చలు చాలా కీలకం కానున్నాయి. ఈ పర్యటనలో ప్రధానంగా రెండు ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని రక్షణ శాఖ తెలిపింది. ఒకటి, రెండు దేశాలు కలిసి రక్షణ సామాగ్రిని తయారు చేసుకోవడానికి సంబంధించిన 'రోడ్‌మ్యాప్', రెండోది ఐక్యరాజ్యసమితి శాంతి దళాల్లో పనిచేసే సైనికులకు ఇచ్చే శిక్షణలో ఒకరికొకరు సహకరించుకోవడం. ఈ ఒప్పందాల వల్ల భవిష్యత్తులో భారత రక్షణ రంగం మరింత బలోపేతం కానుంది.
'మేక్ ఇన్ ఇండియా'పై దృష్టి
కేవలం కొనుగోలుదారుగా మాత్రమే కాకుండా, రక్షణ రంగంలో ఉమ్మడి అభివృద్ధి, ఉత్పత్తి దిశగా భారత్ అడుగులు వేస్తోంది. జర్మనీకి చెందిన ప్రముఖ రక్షణ రంగ సంస్థల ప్రతినిధులతో రాజ్‌నాథ్ సమావేశం కానున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అత్యాధునిక సాంకేతికతను భారత్‌కు తీసుకురావడం, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సరికొత్త రంగాలలో కలిసి పనిచేయడంపై చర్చించనున్నారు.
ఏడేళ్ల తర్వాత తొలిసారి..
చివరిసారిగా 2019 ఫిబ్రవరిలో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ జర్మనీలో పర్యటించారు. ఆ తర్వాత సుమారు ఏడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఒక భారత రక్షణ మంత్రి అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. గతేడాది జూన్‌లో జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ భారత్‌లో పర్యటించగా, దానికి ప్రతిగా రాజ్‌నాథ్ ఈ పర్యటన చేపట్టారు. ప్రజాస్వామ్య విలువలు, అంతర్జాతీయ నియమ నిబద్ధత కలిగిన ఈ రెండు దేశాల మధ్య రక్షణ బంధం ప్రపంచ శాంతికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
