Let's talk: editor@tmv.in
ఫిరాయింపు ఆప్ ఎంపీలు ‘ద్రోహులు’

ఫిరాయింపు ఆప్ ఎంపీలు ‘ద్రోహులు’

Pinjari Chand
26 ఏప్రిల్, 2026

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుల ఇళ్ల ముందు ఆప్ కార్యకర్తలు శనివారం నిరసనలు చేపట్టారు. లూధియానా, జలంధర్ ప్రాంతాల్లో ఎంపీలు హర్బజన్‌సింగ్‌, అశోక్‌మిట్టల్‌, రాజేందర్‌‌ గుప్తా నివాసాల గోడలపై ‘గద్దార్’ (ద్రోహి) అని స్ప్రే పెయింట్‌తో రాసి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆప్ రాజ్యసభ సభ్యులు రాఘవ్‌ చద్దా, సందీప్‌పాఠక్‌తో పాటు మరికొంతమంది ఎంపీలు పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం రాజకీయంగా కలకలం రేపింది.

నిరసనల్లో పాల్గొన్న కార్యకర్తలు ‘పంజాబ్ దే గద్దార్’ అంటూ నినాదాలు చేశారు. జలంధర్‌లో ఆప్ నేత పవన్ కుమార్ టిను మాట్లాడుతూ 2027లో పంజాబ్‌లో మళ్లీ ఆప్ అధికారంలోకి వస్తుంది. బీజేపీకి రాజకీయ స్థలం ఉండదు. అందుకే మా ఎంపీలను ప్రలోభపెట్టి తీసుకెళ్తోందని ఆరోపించారు. లూధియానాలో ఎంపీ రాజిందర్ గుప్తా ఇంటి వద్ద యువజన విభాగ నేత పర్మిందర్ గోల్డీ నేతృత్వంలో నిరసనలు జరిగాయి. పంజాబ్ ప్రజలు ఈ విశ్వాస ఘాతుకాన్ని ఎప్పటికీ క్షమించరని ఆయన అన్నారు.

రాజ్యసభ చైర్మన్‌కు ఆప్ ఫిర్యాదు

ఇదిలా ఉండగా, ఆప్ నాయకుడు సంజయ్‌సింగ్‌ ఈ అంశంపై రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాస్తామని తెలిపారు. పార్టీని వీడి వెళ్లిన ఏడుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరనున్నట్లు చెప్పారు. యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారం రాజ్యసభ, లోక్‌సభలో విడిపోవడం లేదా వర్గాలుగా ఏర్పడడం చట్టబద్ధం కాదు. ఈ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.

‘షీష్ మహల్ 2’ వివాదం

మరోవైపు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌పై బీజేపీ కొత్త ఆరోపణలు చేసింది. ఢిల్లీలో లోధీ ఎస్టేట్‌లో ఆయనకు కేటాయించిన నివాసాన్ని ‘షీష్ మహల్ 2’గా అభివర్ణిస్తూ, అధిక ఖర్చుతో నిర్మించారని ఆరోపించింది. ఈ ఆరోపణలను ఆప్ నేత అతిషీ ఖండిస్తూ ప్రచారం చేస్తున్న ఫోటోలు నకిలీవి. అవి కేజ్రీవాల్ ఇంటికి సంబంధించినవి కావని తెలిపారు. మొత్తంగా, ఎంపీల పార్టీ మార్పు, నిరసనలు, పరస్పర ఆరోపణలతో పంజాబ్, ఢిల్లీ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

ఆప్‌లో పనిచేసేందుకు చోటు లేదు

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను వీడిన నాయకులు భయంతో కాకుండా అసంతృప్తి, విరక్తి కారణంగానే బయటకు వచ్చారని రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌చద్దా పేర్కొన్నారు. ఇటీవల ఆప్‌ను విడిచి బీజేపీలో చేరిన ఆయన, పార్టీ అంతర్గత పరిస్థితులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆప్‌లో నిజాయితీగా పనిచేసే వారికి ఇప్పుడు చోటు లేదు. పార్టీ తప్పుదోవలో నడుస్తోంది. అందుకే నేతలు వరుసగా బయటకు వస్తున్నారని తెలిపారు. పార్టీని నిర్మించేందుకు కష్టపడ్డ చాలా మంది ఇప్పటికే వెళ్లిపోయారని అన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి ‘షీష్ మహల్’ వివాదమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు షీష్ మహల్ పార్ట్ 2 కూడా వెలుగులోకి వచ్చిందని, ఇది పార్టీ ప్రతిష్టను మరింత దెబ్బతీస్తోందని విమర్శించారు. ఈ ఆరోపణలు కేజ్రీవాల్‌కు కేటాయించిన లోధీ ఎస్టేట్ నివాసానికి సంబంధించినవని ఆయన చెప్పారు. ఆ నివాసంలో అధిక వ్యయంతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.