Let's talk: editor@tmv.in
బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ కసరత్తు..సామాజిక, ఆర్థిక స్థితిగతులే కీలకం

బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ కసరత్తు..సామాజిక, ఆర్థిక స్థితిగతులే కీలకం

Panthagani Anusha
5 మే, 2026

రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ సోమవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు జిల్లా అధికారులతో కలిసి బీసీల ప్రస్తుత స్థితిగతులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

సమావేశం అనంతరం రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ రిజర్వేషన్ల నిర్ణయంలో కేవలం కుల గణనను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా వారి సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రధాన ప్రమాణంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. జనాభా నిష్పత్తితో పాటు ప్రాంతీయ పరిస్థితులను బేరీజు వేసి తుది నివేదికను రూపొందిస్తామని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

అధికారులతో జరిగిన సమీక్షలో చైర్మన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల కేటాయింపు బీసీలకు కేటాయించిన సీట్లు మరియు విజయం సాధించిన అభ్యర్థుల సంఖ్యకు సంబంధించిన పూర్తి నివేదికలను సమర్పించాలని అధికారులను కోరారు. అలాగే ఇప్పటివరకు నిర్వహించిన వివిధ సామాజిక, ఆర్థిక సర్వేల వివరాలను కమిషన్‌కు అందజేయాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా జనాభా నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.

బీసీ వర్గాలకు ప్రభుత్వ ఫలాలు, రాజకీయ ప్రాతినిధ్యం సక్రమంగా చేరడమే కమిషన్ లక్ష్యమని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ, అదనపు కార్యదర్శి డి. చంద్రశేఖర్ రావు, బీసీ సంక్షేమ అధికారి బి. శశాంక తదితరులు పాల్గొన్నారు.