Let's talk: editor@tmv.in
తెలంగాణలో ఆన్‌లైన్ ఫార్మసీలపై డీసీఏ దాడులు... 41 షాపులకు నోటీసులు

తెలంగాణలో ఆన్‌లైన్ ఫార్మసీలపై డీసీఏ దాడులు... 41 షాపులకు నోటీసులు

Gaddamidi Naveen
8 జూన్, 2026

తెలంగాణలో ఆన్‌లైన్ ఫార్మసీల నిర్వాహణలో జరుగుతున్న అక్రమాలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ప్రత్యేక నిఘా చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 6న నిర్వహించిన ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌లో మొత్తం 166 మెడికల్ షాపులను అధికారులు పరిశీలించారు. ఆన్‌లైన్ ఔషధ విక్రయాల వ్యవస్థలు చట్టబద్ధంగా పనిచేస్తున్నాయా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం–1940, సంబంధిత నిబంధనలను పాటిస్తున్నాయా అనే అంశాలను ఈ తనిఖీల్లో పరిశీలించారు.

తనిఖీ చేసిన 166 మెడికల్ షాపుల్లో 159 దుకాణాలు ఆన్‌లైన్ మెడిసిన్ డెలివరీ సేవలకు అనుబంధంగా ఉన్నవిగా గుర్తించారు. వీటిలో ఆన్‌లైన్ ఫార్మసీ సంస్థల లైసెన్సు పొందిన కేంద్రాలు, వాటి భాగస్వామ్య మెడికల్ షాపులు ఉన్నాయి. అదనంగా, ఇండియామార్ట్ వంటి ఆన్‌లైన్ బిజినెస్-టు-బిజినెస్ (బీ2బీ) వేదికలతో అనుసంధానమైన మరో 7 మెడికల్ షాపులను కూడా అధికారులు తనిఖీ చేశారు.

ఈ తనిఖీల సందర్భంగా పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చినట్లు డీసీఏ వెల్లడించింది. ముఖ్యంగా మందుల విక్రయాలకు సంబంధించిన బిల్లులను నిర్వహించకపోవడం లేదా అధికారులకు చూపించలేకపోవడం, ప్రిస్క్రిప్షన్ ఔషధాల రిజిస్టర్లు, షెడ్యూల్–హెచ్1 మందుల రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం వంటి లోపాలు గుర్తించబడ్డాయి. అలాగే మందుల కొనుగోలుకు సంబంధించిన ఇన్వాయిసులను సమర్పించకపోవడం, నమోదిత వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రిస్క్రిప్షన్ మందులను విక్రయించడం కూడా బయటపడింది. అంతేకాకుండా, నమోదిత ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా మందుల విక్రయాలు జరపడం, అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను సక్రమంగా భద్రపరచకపోవడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ ఫార్మసీలకు అనుబంధంగా ఉన్న 41 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీసీఏ తెలిపింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం–1940 నిబంధనలను పాటించడం ప్రతి మెడికల్ షాపుకు తప్పనిసరి అని డీసీఏ స్పష్టం చేసింది. ఆన్‌లైన్ వేదికలతో అనుసంధానమై ఉన్న మెడికల్ షాపులు కూడా చట్టపరమైన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించాల్సిందేనని హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.