Let's talk: editor@tmv.in
కాకతీయ హిల్స్‌లో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీలు

కాకతీయ హిల్స్‌లో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీలు

Gaddamidi Naveen
25 ఏప్రిల్, 2026

నగరంలోని కావూరి హిల్స్, కాకతీయ హిల్స్ ప్రాంతాల్లో పౌర సౌకర్యాలను మెరుగుపరచడంపై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన ప్రత్యేక దృష్టి సారించారు. శుక్ర‌వారం జోనల్, డిప్యూటీ కమిషనర్లతో కలిసి ఆమె ఈ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు.

పర్యటనలో భాగంగా కమిషనర్ స్థానిక నివాసితులు, ఉదయం వాకింగ్‌కు వచ్చిన వారు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘99 కార్యాచరణ ప్రణాళిక’ పురోగతిని ఇంటింటికీ చెత్త సేకరణ ప్రక్రియను ఆయన సమీక్షించారు. కావూరి హిల్స్ పార్కులోని యోగా కేంద్రం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. కాకతీయ హిల్స్ పార్క్-1లో షటిల్, పికిల్‌బాల్ కోర్టులను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

కాకతీయ హిల్స్‌లో నిర్వహించిన 'ఫ్రైడే డ్రై డే' ర్యాలీలో పాల్గొన్నారు. వీధి వ్యాపారులు నో ట్రేడ్ - నో బిన్ (బుట్ట లేకపోతే వ్యాపారం లేదు) నిబంధనను పాటిస్తున్నారో లేదో తనిఖీ చేశారు. రోడ్ నంబర్ 3లో నీరు నిలిచే ప్రాంతాలను, రోడ్ నంబర్ 4 & 6 జంక్షన్లను పరిశీలించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. రోడ్డు వెడల్పును అడ్డుకుంటూ వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. వక్ఫ్ భూమి ప్రాంతంలో రోడ్ నంబర్ 6-11 పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది.

కాకతీయ హిల్స్‌లో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీలు - Tholi Paluku