Let's talk: editor@tmv.in
సీఎం చంద్రబాబు పేరుతో సైబర్ మోసం.. వీడియో కాల్‌తో రూ.80 వేల టోకరా

సీఎం చంద్రబాబు పేరుతో సైబర్ మోసం.. వీడియో కాల్‌తో రూ.80 వేల టోకరా

Gaddamidi Naveen
14 జూన్, 2026

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధుల వరకు ఎవరినీ వదలకుండా సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వాడుకుంటూ అమాయకులను తమ వలలో వేసుకుంటున్నారు. తాజాగా విశాఖపట్నంలో సంచలనం రేపే హైటెక్ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పేర్లను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఏఐతో ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి ఓ వ్యక్తిని నమ్మించి రూ.80 వేల మేర మోసం చేసిన ఘటన తాజాగా బయటపడింది. బాధితుడు సీతంపేటకు చెందిన శ్రీనివాసరెడ్డి.

తన భూ వివాద సమస్య పరిష్కారం కోసం శ్రీనివాసరెడ్డి సోషల్ మీడియాలో మంత్రి లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టు చేశారు. మరుసటి రోజే టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న ఓ వ్యక్తి ఆయనకు కాల్ చేసి, సమస్య సీఎంవో దృష్టికి వెళ్లిందని చెప్పి నిజమని నమ్మేలా చేశాడు. తాము నిజంగానే సీఎంవో కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని నమ్మించేందుకు వీడియో కాల్ కూడా చేశారు.

వీడియో కాల్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాట్లాడుతున్నట్లుగా కనిపించే ఏఐ ఆధారిత వీడియోలను చూపించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం భూ వివాదం క్లిష్టమైనదని, కొన్ని ప్రక్రియల కోసం డబ్బులు అవసరమని చెబుతూ దశలవారీగా రూ.80 వేల వరకు వసూలు చేశారు.

డబ్బులు పంపిన తర్వాత అవతలి వ్యక్తుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాసరెడ్డి తాను మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ప్రముఖుల పేర్లు, ఏఐ సాంకేతికతను ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.