Let's talk: editor@tmv.in
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన సైబర్ క్రైమ్ ఐజీ.. ‘ఈగల్’ వార్షిక నివేదిక అందజేత

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన సైబర్ క్రైమ్ ఐజీ.. ‘ఈగల్’ వార్షిక నివేదిక అందజేత

Gaddamidi Naveen
4 జులై, 2026

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ ఏకే రవికృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈగల్ విభాగం రూపొందించిన వార్షిక నివేదికను ఉప ముఖ్యమంత్రికి అందజేశారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఈగల్ విభాగం చేపడుతున్న చర్యలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు అమలు చేస్తున్న వ్యూహాలు, ఇప్పటివరకు సాధించిన ఫలితాలపై నివేదికలో పొందుపరిచిన ముఖ్యాంశాలను ఐజీ ఏకే రవికృష్ణ వివరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఈగల్ విభాగం సమర్థవంతంగా సహకరిస్తోందని తెలిపారు.

అలాగే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వేధింపులు, ట్రోలింగ్, మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వ్యక్తులపై సైబర్ క్రైమ్ విభాగం తీసుకుంటున్న కఠిన చర్యలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఇటువంటి నేరాలపై సాంకేతిక ఆధారాలతో వేగంగా దర్యాప్తు నిర్వహిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల భద్రత, మహిళల రక్షణ, సైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.