Let's talk: editor@tmv.in
రూ.9 లక్షల లంచం డిమాండ్.. సైబర్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

రూ.9 లక్షల లంచం డిమాండ్.. సైబర్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

Panthagani Anusha
1 జూన్, 2026

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కీలక బాధ్యతల్లో ఉంటూ చట్టాన్ని రక్షించాల్సిన ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. సైబర్ మోసం కేసులో నిందితుడి కుటుంబ సభ్యులను రక్షించేందుకు భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసిన ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్‌ను ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో నమోదైన ఒక సైబర్ మోసం కేసులో ఓ వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ కేసు పరిధిని పెంచి సదరు నిందితుడి కుటుంబ సభ్యులను స్నేహితులను కూడా కేసులోకి లాగుతామంటూ ఇన్‌స్పెక్టర్ మహేందర్ బెదిరింపులకు దిగాడు. అలా చేయకుండా ఉండాలంటే రూ.9 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇన్‌స్పెక్టర్ వేధింపులను తట్టుకోలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

ఇప్పటికే రూ. 5 లక్షల వసూలు.. కార్యాలయంలోనే అరెస్ట్

కాగా మహేందర్ ఇప్పటికే బాధితుడి నుండి రెండు విడతలుగా రూ. 5 లక్షల నగదును లంచంగా వసూలు చేసినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మిగిలిన రూ. 4 లక్షల బకాయిని వెంటనే చెల్లించాలంటూ శనివారం తన కార్యాలయంలో బాధితుడిపై మహేందర్ తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్న సమయంలో నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు దాడి చేసి మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఇన్‌స్పెక్టర్ ఇంట్లో నోట్ల కట్టలు, బంగారం లభ్యం

మహేందర్ అరెస్ట్ అనంతరం ఏసీబీ అధికారులు మరింత వేగం పెంచారు. అతని నివాసంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.13 లక్షల నగదుతో పాటు భారీగా బంగారు ఆభరణాలు, పలు విలువైన ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.